Share News

ఇక ప్రచార హోరు

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:23 AM

స్థానిక సంస్థల రాజ కీయ వేడి రాజుకుంది.

ఇక ప్రచార హోరు

పెద్దపల్లి/మంథని, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల రాజ కీయ వేడి రాజుకుంది. జిల్లాలో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ పక్రియ బుధవారం ముగిసింది. పల్లెల్లో ఇక ప్రచార పర్వం మారు మోగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 53 వార్డు స్థానాల్లో కూడా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మంథని మండలంలో మూడు, రామగిరి మండలంలో ఒక పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని మండలం మైదుపల్లి పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించగా, పంతంగి లక్ష్మన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కొత్తగా ఏర్పడ్డ తోట గోపయ్యపల్లి పంచాయతీ సర్పంచ్‌ బీసీ జనరల్‌కు కేటాయించగా సర్పం చ్‌గా దొబ్బల రమేష్‌, ఆరు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించగా బెల్లంకొండ శ్రీదేవి ఏకగ్రీవంగా గెలుపొందారు. రామగిరి మండలం చందనాపూర్‌ పంచాయతీ సర్పంచ్‌ బీసీ మహిళకు రిజర్వు చేయడంతో కొండా మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారుడిగా ఉన్న పంతంగి లక్ష్మణ్‌ మంగళవారం రాత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి మైదుపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చర్చనీయాంశంగా మారింది. ముత్తారం మం డలంలో 20 వార్డులు, రామగిరి మండలంలో 24 వార్డులు, కమాన్‌పూర్‌ మండలంలో 12 వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని నియో జకవర్గంలో నాలుగు పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మంత్రి శ్రీధర్‌బాబు, ద్వితీయ శ్రేణి నాయకులు మంతనాలు జరిపారు.

బరిలో ఉన్న ప్రత్యర్థి పై ఎన్నికల్లో పై చేయి సాధించడానికి రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగేందుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు సర్పంచ్‌ అభ్యర్థులు ఎన్నికల అవసరాల కోసం ముందస్తుగానే భారీగా డబ్బులు, మద్యాన్ని సమకూర్చుకున్నట్లు సమాచారం. తొలి విడుత పోలింగ్‌ జరిగే 5 మండలాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచే సర్పంచ్‌ అభ్యర్థుల పోటీ అధికంగా ఉంది. 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, దాదాపు 12 ఏళ్ళ తర్వాత గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు రావడంతో, రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉండటంతో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే అధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని సమన్వయం చేయటానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మంగళవారం రాత్రి మంథనిలో మకాం వేసి బుధవారం తెల్లవారుజాము వరకు పలు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌ అభ్యర్థులతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కరే సర్పంచ్‌ బరిలో ఉండేలా సహకరించాలని సూచించారు.

ఫ 11న పోలింగ్‌

మంథని, కమాన్‌పూర్‌, ముత్తారం, రామగిరి, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో ఈనెల 11వ తేదీన తొలి విడుత ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మంథని మండలంలోని 35 పంచాయతీలు, 282 వార్డు స్థానాలు, కమాన్‌పూర్‌ మండలంలోని 9 పం చాయతీలు 92 వార్డుస్థానాలు, ముత్తారం మండలంలోని 15 పంచాయ తీలు, 138 వార్డు స్థానాలు, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని 24 పంచా యతీలు, 226 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఫ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు..

మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం పోటీలో ఉన్న సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థులకు అక్షరమాలను బట్టి రిటర్నింగ్‌ అధికారులు గుర్తులు కేటాయించారు. రేపటి నుంచి సదరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఫ మూడో విడత నామినేషన్లు షురూ..

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఆరంభమయ్యింది. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఎలిగేడు, ఓదెల మండలాల్లోని 91 పంచాయతీలు, 852 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఫ ఎలిగేడు మండలంలోని 12 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 9 నామినేషన్లు, 114 వార్డు స్థానాలకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఫ సుల్తానాబాద్‌ మండలంలోని 27 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 34 నామినేషన్లు, 246 వార్డు స్థానాలకు 84 నామినేషన్లు వచ్చాయి.

ఫ ఓదెల మండలంలోని 22 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 23 నామినేషన్లు, 198 వార్డులకు 57 నామినేషన్లు వచ్చాయి.

ఫ పెద్దపల్లి మండలంలోని 30 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 41 నామినేషన్లు, 294 వార్డు స్థానాలకు 155 నామినేషన్‌లు దాఖలయ్యాయి.

Updated Date - Dec 04 , 2025 | 01:23 AM