మదింపు జరగక... ఆదాయం పెరగక
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:44 AM
గ్రామపంచాయతీలకు సరైన ఆదాయ వనరులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.
హుజూరాబాద్‌రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీలకు సరైన ఆదాయ వనరులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సక్రమంగా నిధులు విడుదల కావడం లేదు. వీధి దీపాలు, మంచినీటి పథకాలకు విద్యుత్ బిల్లుల చెల్లింపు, ట్రాక్టరు మరమ్మతులు, నిర్వహణ, పారిశుధ్యం, ఇతరత్రా పనులు చేపడుదామంటే పంచాయతీ ఖాతాల్లో డబ్బులు ఉండడం లేదు. సొంత ఆదాయ వనరులు (జనరల్ ఫండ్) పెంచుకునే అవకాశమున్నా గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లలో ఇంకా పాత విధానమే కొనసాగుతోంది. ఆస్తి రకం ఎలాంటిదైనా ఏడాదికి అయిదు శాతం మాత్రమే పెంచి వసూలు చేస్తున్నారు. దీంతో ఏటా ఆస్తి పన్ను డిమాండ్ పెరగడం లేదు.
మండలంలో 19 గ్రామపంచాయతీలు, వాటి అనుబంధ గ్రామాలు కలుపుకొని మండలంలో 23 గ్రామాలు ఉన్నాయి. 2024-25 సంవత్సరంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం ఆధారంగా మండల వ్యాప్తంగా 3,55,216 రూపాయల విలువ చేసే ఇంటి భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ఇళ్ల చుట్టు కొలతలు నమోదు చేసుకుని మార్కెట్ విలువ ఆధారంగా ఇంటికి అసెస్‌మెంట్ చేస్తే వాస్తవ పన్ను వస్తుంది. ఆస్తి పన్నుపై ఎనిమిది శాతం గ్రంథాలయ సెస్సు, 15 శాతం డ్రైనేజీ ట్యాక్స్, 15 శాతం వీధి దీపాల ట్యాక్స్, 10 శాతం తాగునీటి ట్యాక్స్ కలిపితే ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్ను రెట్టింపు వస్తుంది.
ఫ గ్రామాల్లో పెరుగుతున్న కాంక్రీట్ భవనాలు..
గ్రామాల్లో పాతతరం పెంకుటిళ్లను, రేకుల షెడ్లను కూల్చివేసి అన్ని వసతులు కలిగిన విశాలమైన కాంక్రిటు భవనాలను నిర్మించుకుంటున్నారు. ఆస్తి పన్ను రికార్డులో మాత్రం ఇంకా పాత ఇళ్లగానే గుర్తించి పన్నులు వసూలు చేస్తున్నారు. ఏటా ఆస్తుల సంఖ్య పెరుగుతున్నా.. ఇళ్ల చుట్టు కొలతలు నమోదు చేయకుండా నామమాత్రంగానే పన్నులు విధించి వసూలు చేస్తున్నారు. దీంతో పంచాయతీలు ఆదాయం కొల్పోతున్నాయి.
ఫ ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా ట్యాక్స్ వసూలు
- తూర్పాటి సునీత, ఎంపీడీవో, హుజూరాబాద్.
పంచాయతీల్లో ఏటా ఆస్తి పన్ను ఐదు శాతం పెంచి వసూలు చేస్తున్నాం. గ్రామాల్లో కొత్త నివాస గృహాలను నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ కోసం అనుమతులు తీసుకోవాలి. అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది.