Share News

నయా జోష్‌..

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:30 AM

కేరింతలు.. కేకలు.. సంబురాలు.. సంతోషాలు.. అంబరాన్ని తాకిన ఆనందాలు... కొన్ని దుఃఖాలు, చేదు అనుభవాలు, కాలం వదిలిన జ్ఞాపకాలను మిగిల్చి 2025 కొన్ని గంటల్లోనే వెళ్లిపోనుంది. 2026కి నయా జోష్‌గా స్వాగతం పలకడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వయోభేదం లేకుండా సిద్ధమవుతున్నారు.

నయా జోష్‌..

- జిల్లాలో కొత్త సందడి.. వేడుకలకు సిద్ధం

- పోలీసు నిబంధనలతో జాగ్రత్త

- న్యూ ఇయర్‌ వేడుకలకు యువత ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కేరింతలు.. కేకలు.. సంబురాలు.. సంతోషాలు.. అంబరాన్ని తాకిన ఆనందాలు... కొన్ని దుఃఖాలు, చేదు అనుభవాలు, కాలం వదిలిన జ్ఞాపకాలను మిగిల్చి 2025 కొన్ని గంటల్లోనే వెళ్లిపోనుంది. 2026కి నయా జోష్‌గా స్వాగతం పలకడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వయోభేదం లేకుండా సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీస్‌ నిఘా... నిబంధనలు, బందోబస్తు, ఆంక్షలు ఉండడంతో కొత్త ట్రెండ్‌గా యువత ఫ్యామిలీతోనే ఇళ్లలో ధూంధాంగా వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. బధవారం రాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పట్టణల్లోని కాలనీల్లో, కొన్ని కొన్ని కుటుంభాలు కలిసి కొత్త వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, పోలీసుల తనిఖీల ఇబ్బందులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకున్న యువకులు తమ ఫ్యామిలీలతో కలిసి సంబురాల జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లో వీలుకాని యువకులు హైదరాబాద్‌, బెంగుళూరు, గోవాలాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.

మద్యంషాపులు బిజీ బిజీ..

జిల్లా అంతటా కొత్త సంవత్సరం సందడి అప్పుడే మొదలైంది. మద్యం షాపులు బిజీబిజీగా మారనున్నాయి. మద్యంప్రియులను దృష్టిలో పెట్టుకున్న ఎక్సైజ్‌ శాఖ ఈ సంవత్సరం కూడా మద్యం దుకాణాలు, బార్‌లు ఆర్ధరాత్రి వరకు తెరచి ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలు రూ.3 కోట్లకు పైగానే జరుగున్నాయి. కొంతకాలంగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం విక్రయాల క్రేజ్‌ వీపరితంగా పెరిగింది. మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయని భావించి వైన్స్‌ యజమానులు నిల్వలు పెంచారు.

బిర్యానీ పాయింట్లలో ప్రత్యేక ఆఫర్లు..

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే దావత్‌లకు బిర్యానీ పాయింట్‌ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, మండల కేంద్రాల్లో కూడా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ఆపర్లు ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో చికెన్‌, మటన్‌ కాకుండా ప్రాన్స్‌, ఫిష్‌ బిర్యానీలకు ప్రత్యేక ఆకర్షణగా పెట్టారు. దీంతో పాటు స్నాక్స్‌ కూడా అందిస్తున్నారు. డ్రమ్‌స్టిక్‌, తందూరి చికెన్‌, చికెన్‌ 65, ధమ్‌కీ చికెన్‌, కబాబ్‌లు, రుమాలి రోటీలు అమ్మకాలకు ప్రచారం చేస్తున్నారు. ఫుడ్‌ బిజినెస్‌ దాదాపు రూ.50 లక్షల వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి.

బేకరీల వద్ద సందడి..

కొత్త వేడుకకు సిరిసిల్ల, వేములవాడలో బేకరీలు కేక్‌ల తయారీతో బిజీబిజీగా మారాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌ కట్‌ చేయడానికి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ల వరకు ఉత్సహం చూపుతారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కేక్‌లను తయారుచేస్తున్నారు. జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలకే దాదాపు రూ.25 లక్షల వరకు కేక్‌ల బిజినెస్‌ జరిగే అవకాశం ఉంది. రూ.50 నుంచి రూ.500 వరకు రకరకాల డిజైన్లలో కేక్‌లను సిద్ధం చేస్తున్నారు.

ఒక్క రోజే రూ 4.31 కోట్ల మద్యం అమ్మకాలు..

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గత సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు ఒక్క రోజే జిల్లాలో రూ.4.31 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లిక్కర్‌ 3723 బాక్స్‌లు, బీర్లు 3852 బాక్స్‌ల అమ్మకాలు జరిగాయి. 2023 డిసెంబరు 31న రూ.1.36 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. లిక్కర్‌ 1164 బాక్స్‌లు, బీర్లు 2407 బాక్స్‌ల అమ్మకాలు జరిగాయి. 2023 సంవత్సరంతో పోల్చుకుంటే 2024లో లిక్కర్‌ 2559 బాక్స్‌లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. బీర్లు 1445 బాక్స్‌లు అమ్మకాలు పెరిగాయి. 2023 సంవత్సరం కంటే రూ.2.95 కోట్ల ఆదాయం పెరిగింది.

వేడుకలపై పోలీస్‌ నజర్‌...

జిల్లాలో శివారు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్‌ నజర్‌ పెట్టింది. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీ మహేష్‌ బీ గీతే ఇప్పటికే పలు సూచనలు చేశారు. యువకులు మద్యం సేవించి అతి ఉత్సహంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో డిసెంబర్‌ 31 రాత్రివేళల్లో నిఘా పెట్టారు.

పోలీస్‌ నియంత్రణలు ఇలా...

ఫ మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపై జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు .

ఫ మైనర్‌, యువకులకు బైక్‌లు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు. తల్లిదండ్రులు మైనర్‌ పిల్లలకు బైక్‌లు ఇవ్వవద్దు. పట్టుబడితే కేసులు నమోదు చేస్తారు.

ఫ అతివేగంగా వాహనాలు నడిపితే చర్యలు, జరిమానాలు.

ఫ అధిక శబ్దాలు చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దు.

ఫ గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లొద్దు.

ఫ రోడ్లపై టపాసులు కాల్చడం మైక్‌లు ఎక్కువ సౌండ్‌ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు.

ఫ డీజేలు నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడితే సీజ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఫ రాత్రివేళల్లో త్రిబుల్‌ రైడింగ్‌, సైలెన్సర్‌లను తీసివేసి వాహనాలను నడుపుతూ శబ్దకాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్‌ చేస్తారు.

ఫ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే పోలీస్‌ చర్యలు ఉంటాయి.

అనందోత్సహాల మధ్య వేడుకలు జరుపుకోవాలి...

- ఎస్పీ మహేష్‌ బీ గీతే

ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పలు సూచనలు చేశాం. పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో పెట్రోలింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌లు ముమ్మరంగా నిర్వహిస్తాం. ప్రజలు అర్ధరాత్రి 12.30 గంటలలోపు వేడుకలు ముగించుకోవాలి. కుటుంబసభ్యులతో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలి.

Updated Date - Dec 31 , 2025 | 01:30 AM