కొత్తగా ‘ఉపాధి’
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:32 AM
జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచే చేపట్టాల్సి ఉన్నప్పటికీ స్థానికసంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు.
- మారనున్న పనుల ప్రాధాన్యత
- జీపీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం
- ఇసుక మేటల తొలగింపు
- ఇందిరమ్మ ఇళ్లు, పొలం పనుల్లో కూలీల సహాయం కోసం ప్రణాళిక
- ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే అవకాశం
- పనుల గుర్తింపునకు గ్రామసభల నిర్వహణ
- 58 రకాల ఉపాధిహామీ పనులు చేపట్టాలని నిర్ణయం
జగిత్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచే చేపట్టాల్సి ఉన్నప్పటికీ స్థానికసంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో జిల్లాలో ఈనెలలో గ్రామసభల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించనున్నారు. మట్టి పనులను తగ్గించి ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ప్రధానంగా బిల్డింగులు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్ వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మాణాలు, కిచెన్ షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
58 రకాల పనులు..
నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులు గుర్తించాలి. జిల్లావ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీలుండగా అన్నింటా గ్రామసభలు నిర్వహించడానికి ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆమేరకు 58 రకాల పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్‌కు, ఆ తర్వాత జిల్లాకు పంపించి అనుమతులు తీసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ యేడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు.
తగ్గనున్న పూడికతీత పనులు..
ఉపాధిహామీ పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఈ పనుల పేరుతో ఏటా రూ. కోట్లలో నిధులు వ్యయం అవుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పూడికతీత పనుల్లో అక్రమార్కులకు మరింత లాభం చేకూరేలా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి. ఉపాధి హామీ పనులపై నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్‌లో తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ. లక్షల్లో నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను ఈ పూడికతీత పనుల అంచనా తయారీని తగ్గించారు.
నిబంధనల ప్రకారం పనులు.
- రఘువరన్, డీఆర్‌డీవో, జగిత్యాల
ఈ యేడాది ఉపాధిహామీ పనుల్లో ప్రభుత్వం కొత్తగా పనులను ఎంపిక చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ సభల్లో ఎంపిక చేస్తాము.