Share News

కాంగ్రెస్‌లో నూతన కమిటీలు

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:18 AM

పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో అధికార కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నది.

కాంగ్రెస్‌లో నూతన కమిటీలు

- సమన్వయ బాధ్యత జిల్లాకు చెందిన రుద్ర సంతోష్‌కు..

- జిల్లా పరిశీలకులుగా అమిత్‌రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్‌

- జనవరి 1లోగా కమిటీలకు జాబితాల సమర్పణ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో అధికార కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నది. ఆ ఎన్నికలలోగానే పార్టీ జిల్లా, నగరశాఖల కమిటీలను ప్రకటించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్‌ కమిటీ అధ్యక్షులను నియమించిన అధిష్ఠానం త్వరలోనే అన్ని పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నది. జనవరి 1 నాటికి అన్ని కమిటీల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించింది. జిల్లాకే చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్‌కుమార్‌కు ఈ కమిటీల నియామకాలను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ జిల్లాలో కమిటీల పదవులను భర్తీ చేసే ప్రక్రియను నిర్వహించేందుకు నమిండ్ల శ్రీనివాస్‌, గుత్తా అమిత్‌రెడ్డిని బాధ్యులుగా నియమించారు. గతంలో ఈ బాధ్యతలో ఉన్న రఘునాథ్‌రెడ్డి తాజాగా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో ఆయన స్థానంలో అమిత్‌రెడ్డిని నియమించారు. నమిండ్ల శ్రీనివాస్‌ పరిశీలకుడిగా ఉంటారు.

ఫ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలపై కన్ను..

రెండురోజుల్లోగానే పరిశీలకులు, ఇన్‌చార్జి జిల్లాకు చేరుకొని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌తో కమిటీలలోని ఇతర పదవుల భర్తీ విషయమై చర్చించనున్నారని సమాచారం. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పదవుల భర్తీచేసేందుకు ప్రతిపాదిత పేర్లను జనవరి 1లోగా వీరు సమర్పిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్‌ పురపాలక సంఘాల్లోనూ పాగా వేయాలని భావిస్తున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే పురపాలక సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయి జిల్లా కమిటీ, నగర కమిటీలు ఉంటే పురపాలక సంఘాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎక్కువ మంది పనిచేయడానికి వీలు కలుగుతుందని, అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ఈ కమిటీల పదవులను భర్తీ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ సీనియర్‌ కార్యకర్తలు, నాయకులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండు బ్లాకులుగా విభజించి, ఒక్కో బ్లాక్‌కు ఇద్దరు చొప్పున ఉపాఽధ్యక్షులను నియమించాలని, ఇద్దరేసి ప్రధాన కార్యదర్శులను నియమించాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కమిటీలు రూపొందిస్తున్నారు. అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులతోపాటు ఒక కోశాధికారి, 15 మందికి మించకుండా కార్యవర్గ సభ్యులను నియమించాలని నిర్ణయించుకొని ఆ మేరకు పార్టీ పరిశీలకులకు గైడ్‌లైన్స్‌ అందజేశారని సమాచారం. జనవరి 1వ తేదీలోగా జిల్లాల ఇన్‌చార్జీలు, పరిశీలకులు ఈ జాబితాలను అప్పగించిన వెంటనే రాష్ట్ర కమిటీ వాటిని పరిశీలించి సంక్రాంతిలోగా ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Dec 23 , 2025 | 01:18 AM