Share News

కలిసికట్టుగా మంతనాలు..

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:46 AM

కొత్త మద్యం పాలసీ ఖరారైంది. 2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం టెండర్ల ప్రక్రియకు బుధవారం ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీని జారీ చేసింది. లైసెన్స్‌ కాలం 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు నిర్ణయించారు. ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీచేయడంతోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం వ్యాపారులు కలిసికట్టుగా టెండర్లను దక్కించుకునే విధంగా మంతనాలు ప్రారంభించారు.

కలిసికట్టుగా మంతనాలు..

- ఖరారైన కొత్త మద్యం పాలసీ

- 2025-27 కాలపరిమితితో ఎక్సైజ్‌ మార్గదర్శకాలు

- దరఖాస్తు రుసుము రూ.3 లక్షలకు పెంపు

- జిల్లాలోని 48 మద్యం దుకాణాల్లో 34 జనరల్‌ రిజర్వేషన్‌

- ఎస్సీ, గౌడ సామాజిక వర్గాలకు 14 దుకాణాలు రిజర్వ్‌

- టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కొత్త మద్యం పాలసీ ఖరారైంది. 2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం టెండర్ల ప్రక్రియకు బుధవారం ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీని జారీ చేసింది. లైసెన్స్‌ కాలం 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు నిర్ణయించారు. ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీచేయడంతోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం వ్యాపారులు కలిసికట్టుగా టెండర్లను దక్కించుకునే విధంగా మంతనాలు ప్రారంభించారు. జిల్లాలో కొత్త మద్యం కిక్కు కోసం సిండికేట్‌గా మారడానికి సిద్ధమవుతున్నారు. టెండర్లు దక్కించుకోవడానికి గౌడ, ఎస్సీ సామాజిక వర్గాలను కూడా సిండికేట్‌లో భాగస్వామ్యం చేయడానికి సిద్ధమవుతున్నారు. మద్యం టెండర్‌ వస్తే భారీగా ఆదాయం సమకూరుతుందనే భ్రమలో లక్షలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. మళ్లీ ఈసారైనా టెండర్‌ దక్కుతుందనే ఆశతో మరోసారి సిద్ధపడుతున్నారు.

గతంలో దరఖాస్తుల రుసుంతో రూ.40.72 కోట్ల ఆదాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత లైసెన్స్‌ పీరియడ్‌లో 48 దుకాణాలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. 2023-25 కాలానికి సంబంధించి మద్యం వ్యాపారులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. 2023 ఆగస్టులో జరిగిన టెండర్లలో 2,036 మంది దరఖాస్తులు చేసుకోగా 150 మంది మహిళలు ఉన్నారు. దరఖాస్తు రుసుము రూ.2లక్షలు ఉండడంతో ఎక్సైజ్‌ ఖజానాకు జిల్లా నుంచి రూ.40.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెరిగింది. గతంలో రూ.రెండు లక్షలు ఉండగా ఈసారి మూడు లక్షలకు పెంచారు.

రిజర్వేషన్లు, ఎంపిక ప్రక్రియ ఇలా..

మద్యం దుకాణాలు కేటాయింపుల్లో రిజర్వేషన్‌ ప్రక్రియ ఉంటుంది. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకారం దుకాణాలను కేటాయిస్తారు. గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీ వర్గానికి 10 శాతం, ఎస్టీలకు 5 శాతం షాపులను కేటాయించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాలు ఉండగా, ఇందులో నిబంధనలకు అనుగుణంగా ఎస్టీలో జనాభా లేకపోవడంతో గౌడ, ఎస్సీలకు దుకాణాలు కేటాయించారు. 34దుకాణాలు జనరల్‌ కేటగిరిలో ఉండగా, గౌడ సామాజికవర్గానికి 9 దుకాణాలు, ఎస్సీలకు ఐదు దుకాణాలు రిజర్వ్‌ చేసి టెండర్లు పూర్తిచేశారు. ఈసారి రిజర్వేషన్లలో దుకాణాలు మారుతాయని భావిస్తున్నారు. ఈసారి మద్యం దుకాణానికి ఒకటి కంటే ఎక్కువగా దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

ఆరు స్లాబ్‌లో లైసెన్స్‌ ట్యాక్స్‌

మద్యం దుకాణాలను 2011 జనాభా లెక్కల ప్రకారం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం జనాభా లెక్కలు జరుగలేదు కాబట్టి మద్యం దుకాణాలు పెరిగే అవకాశం లేదు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్‌ టాక్స్‌ రూ.50 లక్షలు, 5 నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ 65లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ 85 లక్షల ట్యాక్స్‌ వసూలు చేస్తారు. 20 లక్షలపైన జనాభా ఉంటే రూ.1.10 కోట్లు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. డ్రా పద్ధతి ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. డిసెంబర్‌ 1, 2025 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయి.

జిల్లాలో ఇప్పటివరకు మద్యం విక్రయాలు రూ.837 కోటు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్‌ శాఖకు భారీ రాబడి ఉంది. 1 డిసెంబర్‌ 2023 నుంచి 28 జూలై 2025 వరకు జిల్లాలో వచ్చిన ఆదాయం రూ.837 కోట్లు ఉంది. ఇందులో లిక్కర్‌ కేస్‌లు 14,87,188 విక్రయించగా బీర్‌ కేస్‌లు 14,87,188 విక్రయించారు. 1డిసెంబర్‌ 2021 నుంచి 30 నవంబర్‌ 2023 వరకు రూ.996 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో లిక్కర్‌ కెస్‌లు 8,92,646 విక్రయించగా, బీర్‌ కేస్‌లు 19,01,053 విక్రయించారు.

Updated Date - Aug 21 , 2025 | 12:46 AM