Share News

సంక్షేమ పథకాల అమలుపై నజర్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:15 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలలో జిల్లా యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఇటీవల తనిఖీలు ముమ్మరం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు.

సంక్షేమ పథకాల అమలుపై నజర్‌

జగిత్యాల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలలో జిల్లా యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఇటీవల తనిఖీలు ముమ్మరం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ సైతం ఇటీవల జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వానాకాలం పంటల సాగు, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం, రేషన్‌ కార్డుల పంపిణీలో పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్లలో విస్తృత పర్యటనలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

ఫలబ్ధిదారులకు రేషన్‌కార్డుల పంపిణీ

కొత్త రేషన్‌కార్డుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో నాలుగైదు రోజుల నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నారు. జగిత్యాల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌లు పాల్గొంటున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి, భీమారం మండలాల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.

ఫయూరియా నిల్వలపై ఆరా..

వర్షాలు, సీజనల్‌ వ్యాధులు, వ్యవసాయం, రహదారుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ దిశా నిర్దేశం చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా నియామకం అయిన సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈనెల 28వ తేదీన జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. తర్వాత జిల్లా కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయాన్ని సందర్శించారు. యూరియా నిల్వలు, అమ్మకాల తీరుపై ఆరా తీశారు. కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ క్షేత్ర స్థాయి పర్యటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఫఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్‌

స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కారు సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. అభయహస్తం హామీలో భాగంగా ఆరు పథకాల అమలుపై దృష్టి సారించింది. ప్రధానంగా రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. వీటిని లబ్ధిదారులకు అందించే పనుల్లో యంత్రాంగం తలమునకలవుతోంది. భూ భారతి సమస్యల పరిష్కారంపై కూడా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, ఆయా శాఖల అధిపతులు దగ్గరుండి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ప్రభుత్వ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి తదితర పథకాలన్నీ అందుతాయి. దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షేత్ర స్థాయి అధికారులతో విచారణ పూర్తి చేయించి, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నాం.

Updated Date - Jul 30 , 2025 | 01:15 AM