Share News

అంగన్‌వాడీల బలోపేతంపై నజర్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:27 AM

జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏడాది నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు పెంచే కార్యక్రమంలో భాగంగానే గత ఏడాది నుంచి అమ్మ మాట-అంగన్‌వాడీ బాట పేరిట విద్యాసంవత్సరం ఆరంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి 17 వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది.

అంగన్‌వాడీల బలోపేతంపై నజర్‌

-ఈనెల 17 వరకు ‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’

-జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

-చిన్నారులను అంగన్‌వాడీకేంద్రాల్లో చేర్పించడమే లక్ష్యం

జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏడాది నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు పెంచే కార్యక్రమంలో భాగంగానే గత ఏడాది నుంచి అమ్మ మాట-అంగన్‌వాడీ బాట పేరిట విద్యాసంవత్సరం ఆరంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి 17 వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరేలా ఐదేళ్లు దాటిన వారిని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. జగిత్యాల, మెట్‌పల్లి, ధర్మపురి, మల్యాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అన్ని గ్రామాల్లో అమ్మ మాట-అంగన్‌వాడీ బాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఫపౌష్టికాహారం, విద్య..

జిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లలు 35,487 మంది ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులు 14,306 మంది ఉన్నారు. వీరిలో 5 సంవత్సరాలు నిండిన చిన్నారులు సుమారు 6,030 మంది ఉన్నారు. మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు అందజేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. ఆటపాటలు, కథలతో పాటు సంభాషణ నైపుణ్యాలు నేర్పించి చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ఐదేళ్ల వరకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ ఆ తర్వాత నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమాలు చేపడుతారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకునేలా అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి వివరిస్తారు. రెండున్నరేళ్లు పూర్తయిన చిన్నారులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.

ఫసమస్యలతో సతమతం..

జిల్లాలోని జగిత్యాల, మల్యాల, ధర్మపురి, మెట్‌పల్లిలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలో 304, ధర్మపురిలో 222, మల్యాలలో 227, మెట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో 312 కేంద్రాలున్నాయి. వీటిలో 272 కేంద్రాలు సొంత భవనాలల్లో నిర్వహిస్తున్నారు. 537 కేంద్రాలను అద్దె భవనాల్లో, 256 కేంద్రాలను ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 1,006 మంది టీచర్లు, 783 మంది ఆయాలు పని చేస్తున్నారు. 59 టీచర్‌, 357 మంది ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూపర్‌వైజర్‌ పోస్టులు 42 మందికి గాను 39 మంది పనిచేస్తున్నారు. మూడు సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పక్కనే ఉండే మరో కేంద్రానికి చెందిన టీచర్లు, ఆయాలతో నిర్వహిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాల పర్యవేక్షణ టీచర్లకు కష్టంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నా ఖాళీలను భర్తీ చేస్తేనే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందే అవకాశం ఉంది.

కార్యక్రమాల వివరాలు..

ఫ 10వ తేదీన అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లిదండ్రుల గ్రూప్‌ సెల్ఫీ, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిథులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించారు.

ఫ 11న మూడేళ్లు పైబడిన చిన్నారుల నివాసాలను సందర్శించి అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన పిల్లలకు గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించి ప్రైమరీ స్కూళ్లలో చేర్పిస్తారు.

ఫ 12,13,16వ తేదీల్లో పోషణ కిచెన్‌ గార్డెన్‌ పోషకాహార వివరాలను తెలియజేస్తూ స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తారు. చైల్డ్‌ ఫ్రెండ్లీ వాతావరణం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటారు.

ఫ 17వ తేదీన అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తారు.

చిన్నారులను చేర్పించేలా చర్యలు

-బోనగిరి నరేశ్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లు దాటిన చిన్నారులను చేర్పించేందుకు అమ్మ మాట-అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను దగ్గరలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, చిన్నారులకు అందించే పౌష్టికాహారం, పూర్వపు ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

Updated Date - Jun 11 , 2025 | 01:27 AM