Share News

వైభవంగా నరసింహ జయంత్యుత్సవాలు

ABN , Publish Date - May 12 , 2025 | 12:46 AM

ధర్మపురి క్షేత్రంలో నరసింహ జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా నరసింహ జయంత్యుత్సవాలు

-ధర్మపురిలో ముగిసిన నవరాత్రోత్సవాలు

ధర్మపురి, మే 11 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో నరసింహ జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, అర్చకులు స్వామి వారలకు పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసకపూర్వక, శోడషోపచార పూజ నిర్వహించారు. నృసింహ జయంతి సందర్భంగా రాజగోపురాలకు, శ్రీ స్వామి వారలకు, దేవాలయాలకు ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో రెండు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 3 నుంచి ఆరంభమైన నరసింహ నవరాత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

ఫనరసింహ హోమంలో పాల్గొన్న మంత్రి దామోదర

ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆవరణలో గల యాగశాల వద్ద నిర్వహించిన నరసింహ హోమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పాల్గొన్నారు. లోక క్షేమార్థం, కుటుంబ సౌభాగ్యం కోసం నిర్వహించిన నిత్య నరసింహ హోమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహచే ఆలయ అర్చకులు నంబి అరుణ్‌కుమార్‌, చక్రపాణి కిరణ్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి యాగశాల వద్ద భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల వద్ద మంత్రికి ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాద వితరణ జరిపి, ప్రసాదాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌, వేదపారాయణదారు పాలెపు ప్రవీణ్‌కుమార్‌శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 12:46 AM