Share News

రంగు పడాల్సిందే...

ABN , Publish Date - Mar 14 , 2025 | 01:24 AM

రంగుల పండుగ వచ్చింది..

రంగు పడాల్సిందే...

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రంగుల పండుగ వచ్చింది.. హోలీ వేడుకలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకోవడానికి చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ సిద్ధమయ్యారు. హోలీ పూర్ణిమగా జరుపుకునే వేడుకల కంటే ముందు గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా కామదహన వేడుకలు నిర్వహించారు. ఫాల్గుణ శుద్ధ చతుర్ధశి రోజున కామదహనం, ఫాల్గుణ పౌర్ణిమ, కాముని పున్నమి పేరిట సంబురాలు జరుపుకుంటారు. జిల్లా వ్యాప్తంగా హోలీకి ముందు రోజు కామదహన వేడుకలు ఎంతో సంబురంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

సంబరాలకు సర్వం సిద్ధం..

ఆనందాలను తెచ్చే హోలీ రోజు అందరికి రంగు పడాల్సిందే. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు కూడా యువకులు ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ ఆర్గనైజర్లు రంగంలోకి దిగారు. జోష్‌ను పెంచే దిశగా డీజే సౌండ్ల మోతలు పెరగనున్నాయి. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే గోగుపూల నుంచి మొదలుకొని రకరకాల పూల నుంచి సహజ సిద్ధంగా రంగులు తయారుచేసుకుని ఆడుకునేవారు. ఇప్పుడు ప్రమాదరకరమైన రసాయన రంగులతో ఆడుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. హోలీ పండుగ రంగుల జీవితాన్ని చీకటిమయం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈసారి ప్రకృతి సిద్ధమైన రంగులతోనే సహజంగా ఆడుకోవాలని కోరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పండుగైనా సంప్రాదాయ, ఆచార వ్యవహారంగా జరుపుకుంటారు. రకరకాల రంగులు పులుముకొని ఉల్లాసంగా జరుపుకునే రంగుల కేళిలో ఆనందమయం కావడానికి యువత ఉత్సాహం చూపుతోంది. కలర్‌ఫుల్‌ రంగులతో మార్కెట్‌ కూడా కళకళలాడుతోంది. ఫెస్టివల్‌ ఆఫ్‌ కలర్స్‌గా జరుపుకోవడానికి యువతీయువకులు జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, పిల్లలు సిద్ధమవుతున్నారు. సందడిగా జరుపుకోవడానికి డీజేల మోతలో యువతీయువకులు నృత్యాలు చేస్తూ మద్యం మత్తులో మునిగిపోతారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వసంత కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే వసంతోత్సవంగా కూడా చెప్పుకుంటారు.

హాని కలిగించే రంగులు..

హోలీ అనగానే రంగుల మేళవింపు గుర్తుకు వస్తుంది. గతంలో సహజ రంగులతో హోలీ ఆడేవారు. వాటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రకృతిలో లభించే వెజిటేబుల్స్‌, ఆకులు, పూలతో తయారుచేసిన రంగులతో చర్మరంగు నిగారించడమే కాకుండా రుతువులు మారడం వల్ల వచ్చే దుష్ప్రభావాన్ని నివారిస్తుంది. ఎలాంటి ప్రభావం చూపని పువ్వుల సువాసనలు, కూరగాయల తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ హోలీని ఆడుకోవడం మంచిది. మారుతున్న కాలంలో మార్కెట్‌లోకి రసాయన రంగులు, గులాల్‌ చేరడంతో పలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. రంగుల్లో లోహాలు, ఆమ్లాలు, అల్కలైట్‌, గాజుపొడి, నలుపు రంగులో ఆక్సైడ్‌, ఆకుపచ్చ రంగులో కాపర్‌సల్ఫైట్‌, ఎరుపు రంగులో మెర్క్యూరీ సల్ఫైట్‌తో పాటు చాక్‌పౌడర్‌, సిల్కాన్‌ వంటివి ఉంటాయి. ఇవి చల్లడం వల్ల చర్మ వ్యాదులు, కన్నుల్లో పడితే కళ్లు ఎర్రబారడం, గరగరమనడం సంభవిస్తాయి. చూపు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. చర్మవ్యాధులు, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

రంగుల్లో ఎన్నో భావాలు..

రంగుల్లో ఎన్నో భావాలు వ్యక్తం అవుతాయని చెప్పుకుంటారు. వాయిలెట్‌ రంగు మనస్సును ఆనందాన్ని కలిగిస్తుందని, వ్యక్తుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని చెప్పుకుంటారు. నీలం రంగు వ్యక్తి మనస్సులో విజ్ఞానాన్ని ప్రేరేపిస్తుందని, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని చెబుతారు. ఆకుపచ్చ రంగు మనస్సులో వ్యక్తిపై, వస్తువులపై ఆసక్తి కలిగించడం, ప్రేమభావన పెంపొందించడం, పసుపు రంగు మానసిక ఉత్సాహాన్ని, కాశయం రంగు కల్మషాన్ని తొలగించే గుణం ఉంటుందని భావిస్తారు. ఎరుపు రంగు శక్తికి ప్రతీకగా వెనుకడుగు వేయనితత్వాన్ని పెంచుతుందని భావిస్తారు. ఈ రంగులమయంలో స్నేహంతో జీవితాన్ని ఆనందమయం చేస్తుందని భావిస్తారు. రంగులు చల్లుకునే సమయంలో కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రోడ్లపై అనైతికంగా, బలవంతంగా రంగులు రుద్దడం మంచిది కాదు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటిపై ఎక్కువ సేపు రంగులను ఉండకుండా చూసుకోవడం మంచిది.

శుభాకాంక్షల హోరు..

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ లాంటి సోషల్‌మీడియాలో హోలీ శుభాకాంక్షలతో హోరేత్తిస్తున్నారు. రంగుల రసాయనాలతో హోలీ ఆడుకోవద్దని నిపుణులు చెబుతుంటే.. యువకులు సామాజిక మాధ్యమాల్లో రకరకాల హోలీ పోస్టింగ్‌లు పెడుతున్నారు. రకరకాల మేసేజ్‌లతో శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. రంగులు కోనే ఖర్చులేదు.. నీటి వృథా లేకుండా స్మార్ట్‌ ఫోన్‌లలో విజువల్‌ ఎఫెక్ట్‌తో యువతీయువకులు హోలీకి వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:24 AM