హామీలను నెరవేరుస్తూ ముందుకు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:44 AM
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి 5వ వార్డులో సంఘ భవనాలకు, బొజ్జపల్లిలో బతుకమ్మ తెప్ప, పెద్దమ్మ ఆలయ ప్రహారీగోడ నిర్మా ణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ధనిక రాష్ట్రంలో తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత పాలకుల హయాంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధితో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్ష లను పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. బొజ్జపల్లి బతుకమ్మ తెప్ప నిర్మాణానికి భూమిపూజ నిర్వహించామని అన్నారు. ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ, మహిళల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు బతుకమ్మ తెప్పలు ఎంతో ఉపయోగ పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీరెడ్డి సల్మాన్‌రెడ్డి, బొజ్జ భారతి, రాగిరి నాగరాజు, కాశ శ్రీనివాస్, సిలివేరి శ్రీనివాస్, జడల శ్రీనివాస్, తుమ్మ ప్రశాంత్‌రెడ్డి, బొజ్జ కనుకయ్య, జడల రవీందర్, జ్యోతి, బొజ్జ మల్లయ్య తదితరులు ఉన్నారు.