Share News

కదిలిన యువతరం

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:21 AM

పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపాధి కల్పన అందించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాస పథకానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతరం కదిలింది. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకానికి నిరుద్యోగులతో పాటు పలు రకాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. నిరక్షరాస్యులు సైతం దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాయితీ కోసం ఏదో ఒక యూనిట్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు.

కదిలిన యువతరం

- పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపాధి కల్పన

- జిల్లాలో మొదలైన రాజకీయ పైరవీలు

- జిల్లాలో ఇప్పటివరకు 9694 దరఖాస్తులు

- ఈనెల 14 వరకు చివరి అవకాశం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపాధి కల్పన అందించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాస పథకానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతరం కదిలింది. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకానికి నిరుద్యోగులతో పాటు పలు రకాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. నిరక్షరాస్యులు సైతం దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాయితీ కోసం ఏదో ఒక యూనిట్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఈబీసీ లబ్ధిదారులు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సబ్సిడీతో కూడిన ఆర్థికసహాయం ప్రభుత్వం అందించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఫ జిల్లాలో 9,694 దరఖాస్తులు...

రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాలకు నాలుగు కేటగిరీలుగా అందించడానికి నిర్ణయించారు. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9,694 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌కు 2,272 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్‌కు 543, బీసీ కార్పొరేషన్‌కు 6,309, ఈబీసీ కార్పొరేషన్‌కు 202, మైనార్టీ కార్పొరేషన్‌కు 363, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు 5 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పథకం వర్తిస్తుంది. రేషన్‌ కార్డు, కుల ధ్రువీకరణ, ఆధార్‌, పాన్‌ కార్డు, రవాణా రంగ పథకాలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌, వ్యవసాయ పథకాలకు పట్టాదారు పాసు పుస్తకం, దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు సమర్పించుకోవచ్చు. జూలై 1 నాటికి 21 నుంచి 55 ఏళ్లు ఉన్నవారికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 21 నుంచి 60 ఏండ్ల వరకు అర్హత కల్పించారు. ప్రభుత్వం మార్జిన్‌ మనీతో పాటు బ్యాంక్‌ నుంచి కూడా రుణ సదుపాయం కల్పిస్తారు. రూ.50 వేల వరకు పూర్తి సబ్సిడీ ఇవ్వనున్నారు. కేటగిరీల్లో ఆర్థిక సహాయం అందించనున్నారు. వంద శాతం రాయితీతో రూ.50వేల వరకు సమాయం అందించనున్నారు. యూనిట్‌ ధర 50 వేల నుంచి రూ లక్ష వరకు 90 శాతం రాయితీ, 10 శాతం బ్యాంక్‌ రుణం, యూనిట్‌ రూ లక్ష నుంచి రూ 2 లక్షల వరకు 80 శాతం రాయితీ 20 శాతం రుణం, యూనిట్‌ రూ.2 లక్షల నుంచి రూ 4 లక్షల వరకు 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంక్‌ రుణం అందించనున్నారు.

ఫ వ్యవసాయ యూనిట్లకు ప్రాధాన్యత

రాజీవ్‌ యువ వికాసం పథకంలో వ్యవసాయ రంగాన్ని ప్రొత్సహించే దిశగా యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎడ్ల బండ్లు, ఆయిల్‌ ఇంజన్‌లు, పత్తి సేకరణ, వేరుశెనగ యంత్రాలు, వర్మీ కంపోస్ట్‌, ఆయిల్‌ఫాం సాగు, పశుపోషణ కింద గేదేలు, ఆవుల డెయిరీఫాంలు, కోడిగుడ్ల వ్యాపారం చేపల వ్యాపారం, మేకలు, గొర్రెల పెంపకం, పాల వ్యాపారం ఎయిర్‌ కూలర్లు స్టీల్‌ సామగ్రి, ఆటోమోబైల్‌, బేకరీ వంట వ్యాపారాలను ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. దీంతో వ్యవసాయ కుటుంబాల్లోని నిరుద్యోగులు ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఫ లబ్ధిదారుల ఎంపిక అధికారులకు ఇబ్బందే..

రాజీవ్‌ యువ వికాసం పథకం లబ్ధిదారులను జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఎంపిక చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. రాజీవ్‌ యువవికాసం పథకానికి నిరుద్యోగులతో పాటు ఇప్పటికే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు సైతం దరఖాస్తులను చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న దరఖాస్తులను పరిశీలించడం, ఎంపిక చేయడం అధికారులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. కొందరు యూనిట్‌ మంజూరైతే సబ్సిడీ డబ్బులు మిగులుతాయనే ఆలోచనతో దరఖాస్తు చేసుకుంటున్న వారు ఉన్నారు.

ఫ పైరవీల జోరు..

రాజీవ్‌ యువ వికాస పథకంలో దరఖాస్తులు చేసుకుంటున్న వారిని కొందరు యూనిట్‌ ఇప్పిస్తామని పైరవీలు ఇప్పుడే మొదలుపెట్టారు. అధికార పార్టీలో ఉన్న చోటామోటా నాయకులను దరఖాస్తుదారులు కలుస్తున్నారు. తమకు యూనిట్‌ వచ్చేలా చూడాలని కోరుతూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎంపిక సమయంలో పైరవీలతో అధికారులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి.

రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తులు

మండలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ క్రిస్టియన్‌ మొత్తం

బోయినపల్లి 118 02 284 02 04 00 410

చందుర్తి 108 08 307 15 05 00 443

ఇల్లంతకుంట 143 04 342 08 06 00 503

గంభీరావుపేట 211 96 502 09 75 00 893

కోనరావుపేట 262 49 417 09 09 01 747

ముస్తాబాద్‌ 556 105 1170 68 60 00 1959

రుద్రంగి 12 10 49 00 01 00 72

సిరిసిల్ల మున్సిపల్‌ 88 13 1120 13 77 01 1312

తంగళ్లపల్లి 149 05 480 10 06 00 650

వీర్నపల్లి 26 60 76 04 01 00 167

వేములవాడ రూరల్‌ 115 07 231 03 10 00 366

వేములవాడ అర్భన్‌ 40 05 69 01 05 00 120

వేములవాడ మున్సిపల్‌ 143 54 414 19 39 00 666

ఎల్లారెడ్డిపేట 301 125 851 41 65 03 1386

-----------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 2272 543 6309 202 363 05 9694

-----------------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Apr 10 , 2025 | 01:22 AM