రక్తమోడిన రహదారులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:14 AM
గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది జిల్లాలో నేరాల సంఖ్య కొంత మేర తగ్గుముఖం పట్టినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.
-జిల్లాలో 520 రోడ్డు ప్రమాదాల్లో 171 మంది మృతి
-గత ఏడాదితో పోల్చితే తగ్గిన నేరాలు
-జిల్లాలో 31 హత్యలు.. 9,290 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు
జగిత్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది జిల్లాలో నేరాల సంఖ్య కొంత మేర తగ్గుముఖం పట్టినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ సంవత్సరం మానవ తప్పిదాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బెల్ట్ షాపులు, పేకాట స్థావరాలు, మానవ అక్రమ రవాణా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నిర్వాహకులపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా నేరాలకు కొంత అడ్డుకట్ట వేశారు. డ్రగ్స్, గంజాయి కేసులు కొంత తగ్గినప్పటికీ వినియోగం మాత్రం జరుగుతూనే ఉంది. పండుగలు, ఎన్నికలు, జాతరలు, భారీ సమావేశాల సమయంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు. జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముఖ్యంగా హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, ఆన్‌లైన్ మోసాలు వంటి కేసుల్లో నేరస్తులను త్వరితగతిన గుర్తించి కొంతమేర నివారించగలిగారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించారు. మహిళలు, బాలల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది, ఇందుకోసం షీ టీమ్స్, భరోసా సెంటర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేశారు.
ఫఅత్యధికంగా జగిత్యాల టౌన్ పరిధిలో 770 కేసులు
2025 సంవత్సరంలో జిల్లాలో 5,620 నేరాలు నమోదు కాగా, 2024 నమోదైన 5,919 కేసులతో పోలిస్తే 229 కేసులు తగ్గాయి. 2024 పోలిస్తే 2025 నమోదైన కేసులు 5.05 శాతం తగ్గాయి. జిల్లాలో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 770 కేసులు నమోదు కాగా అత్యల్పంగా బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో 135 కేసులు నమోదు అయ్యాయి. 2025 సంవత్సరంలో మొత్తం 31 హత్య కేసులు నమోదయ్యాయి. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఫనేరాల నమోదు ఇలా..
జిల్లాలో ప్రస్తుత యేడాది ప్రాపర్టీ కేసులు, దొంగతనాలు 381 నమోదు అయ్యాయి. ఇందులో 187 కేసులను పోలీసులు చేదించి రూ.2.92 కోట్ల విలువైన ఆస్తి రికవరీ చేశారు. జిల్లాలో 104 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. గత యేడాదితో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు 5 తగ్గాయి. పీడీఎస్ బియ్యానికి సంబంధించి 19 కేసులు నమోదు కాగా 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా వ్యవహారాల్లో 234 కేసులు నమోదు చేసి 410 మంది నిందితులు, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 167 గేమింగ్ కేసులు నమోదు చేసి రూ.30.62 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 9,290 కేసులు నమోదు చేశారు. ఇందులో 14 మందికి జైలు శిక్షలు విధించబడ్డాయి.
ఫరోడ్డు ప్రమాదాల్లో 302 మందికి గాయాలు
2025 సంవత్సరంలో 2024 సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ మృతుల సంఖ్య తగ్గింది. 2025 సంవత్సరంలో 520 రోడ్డు ప్రమాదాలు కాగా 171 మంది మృతి చెందగా, 302 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అధిక శబ్ధం చేసే 130 మోడిఫైడ్ సైలెన్సర్లు తొలగించారు. కాగా జిల్లాలో 2023 సంవత్సరంలో 448 రోడ్డు ప్రమాదాలు కాగా 178 మంది మృతి చెందగా, 233 మందికి గాయాలు, 37 మంది ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. 2024 సంవత్సరంలో 466 రోడ్డు ప్రమాదాలు కాగా 177 మంది మృతి చెందగా, 259 మందికి గాయాలయ్యాయి.
ఫ24.2 కిలోల గంజాయి స్వాధీనం
ప్రస్తుత యేడాది జిల్లాలో 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని 86 కేసులు, 203 నిందితులను అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత సంవత్సరంలో తరచుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై మొత్తం 76 హిస్టరీ షీట్లు ఓపెన్ చేయగా, అందులో హత్య కేసుల్లో పాల్గొన్న నేరస్తులపై 33 రౌడీషీట్లు ఉన్నాయి. గల్ఫ్‌కు పంపిస్తానని మోసం చేసిన 44 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్టు చేశారు. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడు కేసులు నమోదు చేశారు.
ఫసంచలనాత్మక కేసులు..
జిల్లాలోని కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సంవత్సరాల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల పట్టణంలో జరిగిన డకాయిట్ కేసును ఛేదించి 8 మందిని అరెస్టు, నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2025 సంవత్రంలో 1,351 సైబర్ ఫిర్యాదులు రాగా, వాటిలో రూ.1.72 కోట్ల నగదు బాధితులకు తిరిగి అందించారు. మొత్తం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 1,551 పోయిన మొబైల్ ఫోన్లు గుర్తించి, రూ.3.10 కోట్ల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగించారు.
ఫవంద కేసుల్లో నిందితులకు శిక్షలు..
సమాజంలో నేరాలకు పాల్పడిన ఎవరూ శిక్షల నుండి తప్పించుకోవద్దని పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణలు చేపట్టింది. పటిష్టమైన న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కరించారు.