మంత్రులూ. యూరియా ఇప్పించరూ..
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:15 AM
అత్యధికంగా వరి దిగుబడి సాధిస్తున్న కరీంనగర్ జిల్లాలో నెలరోజులుగా యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెల్లవారు జూము నుంచే విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న రైతన్నల గోడు పట్టించుకున్నవారే లేకుండా పోతున్నారు.
- జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
- మంత్రులు పట్టించుకోవడం లేదని రైతుల ఆగ్రహం
- జిల్లా డిమాండ్ 43,254 మెట్రిక్ టన్నులు
- ఇప్పటి వరకు వచ్చింది 28,921 మెట్రిక్ టన్నులే
(ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి, కరీంనగర్)
అత్యధికంగా వరి దిగుబడి సాధిస్తున్న కరీంనగర్ జిల్లాలో నెలరోజులుగా యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెల్లవారు జూము నుంచే విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న రైతన్నల గోడు పట్టించుకున్నవారే లేకుండా పోతున్నారు. పొలంలో ఒకరు యూరియా కోసం మరొకరు లైన్‌లో ఉంటున్నారు. రైతు దంపతులు సద్దికట్టుకొని వెళ్ళి లైన్లలో నిలబడుతున్నా బస్తా యూరియా దొరకడం లేదు. ఎప్పుడు వస్తుందో చెప్పేవారు లేరు. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి శరీరంలో శక్తి సన్నగిల్లి చెప్పులను లైన్లలో ఉంచి పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. కడుపుమండి ఆగ్రహంతో రైతన్నలు వారి కుటుంబసభ్యులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద, యూరియా అమ్ముతున్న సెంటర్ల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు.
ఫ ముగ్గురు మంత్రులున్నా..
మంత్రులెవరూ తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరు రాష్ట్ర మంత్రివర్గంలో క్రియాశీల పాత్ర వహిస్తున్నారన్న పేరున్నా జిల్లా ప్రజలు మాత్రం వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, క్రిబ్‌కో సంస్థకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉండే మంత్రి పొన్నం జిల్లాలో జరుగుతున్న రైతు ఆందోళనల విషయంలో స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. యూరియా విషయంలో వ్యవసాయ అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన మేరకు తెప్పించేందుకు చర్యలు తీసుకోక పోవడంపై రైతులు ఆగ్రహం, నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. క్రిబ్‌కో డైరెక్టర్‌గా ఉన్న ఆయన చెబితే ఆ సంస్థ నుంచి యూరియా రాకుండా పోతుందా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
- మరో మంత్రి శ్రీధర్‌బాబు రైతుల సమస్యల విషయంలో స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీ శాఖ మంత్రిగా ఆయన నిత్యం వివిధ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో యూరియా దొరకక రైతులు పడుతున్న ఇబ్బందులు, చేస్తున్న ఆందోళనలు ఆయన దృష్టికి రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
- మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కొత్తగా బాధ్యతలు చేపట్టినా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తిగా అన్ని సమస్యలు తెలిసినా తమను పట్టించుకోవడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా తమ సమస్యకు ఏ మార్గం చూపడం లేదని విమర్శిస్తున్నారు. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతూ ధర్నాలకు, ఆందోళనలకు దిగుతున్నా మంత్రుల దృష్టికి పోవడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఫ ఇన్‌చార్జి మంత్రి స్పందించరా..?
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును నియమించారు. ఆయన జిల్లాకు వచ్చి మొదటి సమీక్షా సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవన, విద్యాశాఖలపైనే ప్రత్యేకంగా చర్చించారు. స్వయంగా రైతు అయిన తుమ్మల నాగేశ్వర్‌రావుకు వ్యవసాయంపై రైతుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా రైతులు యూరియా సమస్య ఎదుర్కోవడం బాధాకరమని ప్రతిపక్షాలు అంటున్నాయి. జిల్లా మంత్రులు ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకవెళ్లక పోవడం కూడా కొంత కారణం కావచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ జిల్లాలో 2,76,500 ఎకరాల్లో వరి సాగు
జిల్లాలో వానా కాలంలో 3,43,240 ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని, అందులో ప్రధానంగా వరి అత్యధికంగా 2,76,500 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 48 వేల ఎకరాల్లో పత్తి, నాలుగు వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1200 ఎకరాల్లో కందులు, పెసర, మరో వెయ్యి ఎకరాల్లో మిర్చి పంటలు సాగవుతాయని, మిగతా విస్తీర్ణంలో కూరగాయలు తదితర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు చివరి వరకు 43,254 మెట్రిక్ టన్నుల యూరియా ఆయా పంటల సాగుకు అవసరమవుతుందని వ్యవసాయశాఖ భావించి ఆ మేరకు కోటా విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 6,500 మెట్రిక్ టన్నులు, జూలై నుంచి సెప్టెంబరు వరకు 37,750 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆయా నెలల వారిగా కోటా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.ఇప్పటి వరకు 28,921 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు వచ్చింది. దీనితో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడింది.
ఫ నిల్వ చేసుకుంటున్నారా..?
వరి నాటు వేసే వరకు ఎకరానికి రెండు బస్తాలు (90కిలోలు), ఆ తర్వాత పొట్ట దశలో మరో రెండు బస్తాలు (90 కిలోలు) యూరియా వాడతారు. 2,76,500 ఎకరాల వరి సాగుకు నాటు వేసే వరకు ఈ లెక్కన 24,885 మెట్రిక్ టన్నుల యూరియా, పొట్ట దశలో మరో 24,885 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. మొత్తంగా 50వేల మెట్రిక్ టన్నుల యూరియా వరిసాగుకే అవసరమవుతుంది. మిగతా పంటల సాగుకు వినియోగించే యూరియా దీనికి అదనంగా అవసరముంటుంది. మార్కెట్‌లో ప్రస్తుతం యూరియా అందుబాటులో లేక పోవడంతో వరి పొట్ట దశకు వచ్చేసరికి ఇదే పరిస్థితి ఉంటే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఇప్పుడే అవసరమైన యూరియా మొత్తం కొనుక్కుని నిలువ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా యూరియా ఆందోళనకు కొంత కారణమవుతున్నది.
ఫ ఆర్‌ఎఫ్‌సీఎల్ షట్‌డౌన్ కొరతకు ఓ కారణం
పెద్దపల్లి జిల్లాలో రామగుండం యూరియా ఉత్పత్తి కేంద్రం ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో అది రెండుసార్లు మరమ్మతుకు వచ్చి షట్‌డౌన్ అయింది. 20 రోజులుగా ఉత్పత్తి నిలిచి పోయింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కేటాయించినా ప్రధానంగా ట్రాన్స్‌పోర్టు చార్జీలు తక్కువగా ఉండే వీలుండడంతో ఎక్కువ కోటాను ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేటాయిస్తారు. ఇప్పుడు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇక్కడికి ఇతర కంపెనీల నుంచి యూరియా రావలసిన పరిస్థితి ఉన్నది. ఆయా ఫ్యాక్టరీలకు, కంపెనీలకు వారికి కేటాయించిన ప్రాంతాల కోటా కూడా ఉండడం, ఇక్కడి ప్రజాప్రతినిధుల నుంచి అవసరమైన ఒత్తిడి లేకపోవడంతో ప్రత్యేకంగా ఇక్కడికి యూరియా రావడం లేదని అనుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ బండి సంజయ్‌కుమార్ కేంద్రమంత్రిగా ఉన్నా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముగ్గురు మంత్రులు ఉన్నా యూరియా సమస్య తీరక పోవడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది.