ఉద్యమ స్మృతులు..
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:27 AM
నిజాం సర్కార్, బ్రిటీష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా సాగిన ఎన్నో పోరాటాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కీలక భూమికను పోషించింది. ఆనాటి వీరుల త్యాగాలు.. జాతీయ జెండా రెపరెపలాడిన క్షణాన ఎగిసిన మధుర క్షణాలు.. నేటికీ జిల్లా ప్రజల మదిలో కదలాడుతుంటాయి. ఆగస్టు 15,1947 ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛా వాయిువులు పొందిన రోజు.. భారతీయుల కళ్లలో విరజిమ్మిన కాంతులు... వందేమాతరం, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, క్విట్ ఇండియా, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, సిరిసిల్ల చేనేత కార్మిక మహాసభలు, మానాల అడవుల్లో గెరిల్లా శిబిరాలు, ఖాదీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా మహాసభలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలు కదం తొక్కారు.
- స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చిన సిరిసిల్ల ఆంధ్రా మహాసభ
- సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటున్న జిల్లా ప్రజలు
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- వేడుకలకు ముస్తాబైన సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
నిజాం సర్కార్, బ్రిటీష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా సాగిన ఎన్నో పోరాటాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కీలక భూమికను పోషించింది. ఆనాటి వీరుల త్యాగాలు.. జాతీయ జెండా రెపరెపలాడిన క్షణాన ఎగిసిన మధుర క్షణాలు.. నేటికీ జిల్లా ప్రజల మదిలో కదలాడుతుంటాయి. ఆగస్టు 15,1947 ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛా వాయిువులు పొందిన రోజు.. భారతీయుల కళ్లలో విరజిమ్మిన కాంతులు... వందేమాతరం, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, క్విట్ ఇండియా, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, సిరిసిల్ల చేనేత కార్మిక మహాసభలు, మానాల అడవుల్లో గెరిల్లా శిబిరాలు, ఖాదీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా మహాసభలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలు కదం తొక్కారు. స్వాతంత్య్ర వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎగురవేయనున్నారు. ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆనాటి పోరాట జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
స్వాతంత్య్ర పోరులో నేతన్నలు...
సిరిసిల్ల నేత కార్మికులు ప్రజల దైనందిన సమస్యలతో పాటు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేనేత కార్మిక సంఘం ఏర్పడింది. కార్మిక సంఘం తెలంగాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో జరుపుకున్నారు. 1946లో సభ నిర్వహించగా బొంబాయి, షోలాపూర్, అహ్మదాబాద్ ప్రాంతాలనుంచి చేనేత కార్మిక ప్రతినిధులు సిరిసిల్లకు తరలివచ్చారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ చేనేత వస్త్ర రంగంలో కార్మికుల్లో చైతన్యం నింపింది. సిరిసిల్లలో నిర్వహించిన ఆంధ్ర మహాసభ, మహిళ సభలు ఉద్యమం వైపు నడిపించాయి. ఆ క్రమంలో నాలుగో ఆంధ్ర మహాసభ 1935లో సిరిసిల్లలో భీమకవి నగరంగా మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ యోధులు బద్దంయెల్లారెడ్డి, రామకృష్ణరావు, కెవి రంగారెడ్డి, జెవి నర్సింగారావు, సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణరెడ్డివంటి నాయకులు పాల్గొన్నారు. మహాసభ నిర్వహణలో సిరిసిల్ల తాలూకలోని గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ముఖ్య భూమికను పోషించాడు. వేములవాడ భీమకవి నగరంగా నిర్వహించిన మహాసభకు వివిధ ప్రాంతాలనుంచి ఎంతో మంది పాల్గొన్నారు. సభలో నిర్భంద ప్రాథమిక విద్య జాగీర్‌లోని ప్రజల హక్కులు, రైతాంత సమస్యలు, స్వపరిపాలన, నిమ్నజాతుల ఉద్ధరణ వాటిపై తీర్మానాలు చేశారు. ఇదే ప్రాంగణంలో 4వ ఆంధ్రా మహిళ సభ కూడా నిర్వహించారు. దీనికి మాడపాటి హన్మంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు. ఎల్లప్రగడ సీతాకుమారి లాంటి వారెందరో పాల్గొన్నారు. ఈ మహాసభల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొత్త మలుపు తిరిగాయి. శిస్తు మాఫీ చేయాలని, నిర్బంధ లెవీ ధాన్యం వసూలు చేయవద్దని, బరాయింద ఉద్యమం నడిచింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో మనవాళ్లు...
స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న దేశ ప్రజలు ఆలపించడానికి వందేమాతరం జాతీయ గీతంగా ఉండగా 1938లో నిజాం ప్రభుత్వం నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ విద్యార్థులు ముందుకు సాగారు. ఇందులో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. సిరిసిల్ల పాత తాలుకాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు, 1939లో 7వ తరగతిలో వందేమాతరం ఉద్యమం ప్రభావితం చేసింది. ఆంధ్రా మహాసభ కార్యకలాపాలకు గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి, రుద్రంగికి చెందిన సీహెచ్ నరసింహారావు కూడా రావడం చూసి రష్యన్ రెడ్ అర్మీ తెగించి పోరాడిన ఘట్టాలు చదివిన రాజేశ్వర్‌రావు వారివైపు అడుగులు వేశారు. 1942లో ఊపందుకున్న క్విట్ ఇండియా ఉద్యమంలో సీహెచ్ రాజేశ్వర్‌రావుతో పాటు సీహెచ్ హన్మంతరావు, సి నారాయణరెడ్డి, ముకుందరావు మిశ్రాలు పాల్గొన్నారు. కోనరావుపేటకు చెందిన సీహెచ్ రాజలింగం బాల్యంలోనే రజాకార్ల క్యాంపుపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు.
గ్రంథాలయోద్యమం...
నిజాం నిరంకుశ పాలన కింద బతుకులీడుస్తున్న ప్రజలను పోరాట బాటలో నడిపించడానికి గ్రంథాలయోద్యమం కూడా ముఖ్యమైంది. అక్షర జ్ఞానం నేర్పి పత్రికా పఠనం ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. 1886లో మందిన ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు విశాఖపట్నంలో మొదట గ్రంథాలయాన్ని స్థాపించాడు. కరీంనగర్ జిల్లాలో ప్రథమంగా 1922లో బస్వేశ్వర్‌రావు, వెంకట్రామారావులు, శ్రీవిశేశ్వర భాషా నిలయం పేరిట గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలికారు. 1925లో సిరిసిల్లలో శ్రీ నారాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఖాదీ ఉద్యమంలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగినా చెరఖా సంఘం కార్యక్రమాల్లోనూ నేత కార్మికులు భాగస్వాములు అయ్యారు.
నెత్తుటి గడ్డ... మానాల...
బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సర్కార్ ఇండియన్ యూనియన్‌లో విలీనం కాకుండా రాజీ కుదురించుకున్నారు. దీంతో నిజాంకు సంబంధించిన తాబేదార్ల రాక్షస కృత్యాలు, పోలీసులు, దొరలు, భూస్వాములు, రజకార్ల హింసలు ప్రజలపై పెరిగాయి. ఈక్రమంలోనే నిజాం సర్కార్‌పై సాగుతున్న తెలంగాణ సాయుధ పోరు ఉధృతమయ్యింది. స్వాంతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటుతూనే ముందుకు సాగిన పోరాటాలకు సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం మానాల ప్రధాన కేంద్రంగా మారింది. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరు నుంచి మావోయిస్టుల దళాలకు ఆశ్రయం ఇచ్చి ఉద్యమ స్ఫూర్తిని నిలిపిన మానాల ఇప్పటికి ప్రజల జ్ఞాపకాల మధ్యే ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో మానాల గిరిజన ప్రాంతం ఇప్పటికి మానని గాయాలు సల్పుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి సిరిసిల్ల జిల్లా పరిధిలోకి మారిన మానాల ఎంతో మంది వీరులను తీర్చిదిద్దిన ప్రాంతంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ ప్రాంతం తెలంగాణ పోరాటయోధులకు శిక్షణ జోన్‌గా ఉండేది. సిరిసిల్లకు చెందిన అమృత్‌లాల్‌శుక్లా, బద్దం ఎల్లారెడ్డిల నాయకత్వంలో కార్యకర్తలకు గాయిది గుట్ట శిక్షణా కేంద్రంగా ఉండేది. కమ్యూనిస్టు గెరిల్లాకు గ్రామ భూస్వామి రాజిరెడ్డి భోజనాలు సరఫరా చేసేవారు. ఎంతో నమ్మకంగా మానాల స్థావరం ఉండేది. మానాలలో గెరిల్లాలు శిక్షణ పొందుతుండగా... వంద మంది నిజాం సర్కారు పోలీసులు నిర్బంధించి రుద్రంగి క్యాంపునకు గెరిల్లాలను తరలించారు. ఆ తరువాత నీలం కిష్టయ్య, ముదాం ఎల్లయ్య, సిలివేరు ఎల్లయ్య, లకావత్ కిషన్‌లను మానాల అడవుల్లోకి తీసుకువెళ్లి వారి చేతనే కట్టెలు కొట్టించి, చితి పేర్చి తుపాకులతో కాల్చి దహనం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగిస్తూ కమ్యూనిస్టు గెరిల్లాలు బార్డర్ క్యాంపులను నెలకొల్పారు. యూనియన్ రాష్ట్రాలోన్ని కమ్యూనిస్టు నాయకుల సహకారంతో మరింత శిక్షణ పొందారు. నిమ్మపల్లి, మానాల అడవుల్లో నిజాం సర్కారు పోలీసుల కన్నుగప్పి శిక్షణలు పొందేవారు. మానాలలో ఉద్యమాన్ని అణచడానికి పుట్టుకొచ్చిన కోర్టులను నక్సలైట్లు హతమార్చిన సంఘటనలే కాక గెరిల్లా శిక్షణ కేంద్రానికి నిలువైన ఆనాటి గుట్టపైనే పది మంది మావోయిస్టు నక్సలైట్లను పోలీసులు కాల్చిచంపిన నెత్తుటి దారలు కూడా ఉన్నాయి. మానాల ఉద్యమ కేంద్రంగా ఉండగా... ఆసియాఖండంలోనే పీపుల్స్ వార్ నిర్మించిన అతిపెద్ద తొలి మహిళా స్తూపం కూడా ఉద్యమ జ్ఞాపకాలను కదలాడిస్తోంది.