డీసీసీ అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:47 AM
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వరించింది.
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్)
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వరించింది. ఆయన పేరును అధ్యక్ష పదవికి ఖరారు చేస్తూ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ (అర్బన్ జిల్లా) అధ్యక్షుడిగా వైద్యుల అంజన్‌కుమార్‌ను నియమించారు. వీలైన చోట ఎమ్మెల్యేలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే అవకాశముంటుందని భావించిన పార్టీ అధిష్ఠానం పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయన స్థానంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పార్టీ జిల్లా బాధ్యతలను అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న చోట అర్బన్ కమిటీలను ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ (అర్బన్ జిల్లా) కమిటీ అధ్యక్షుడిగా టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న వైద్యుల అంజన్‌కుమార్‌ను ఎంపిక చేసింది. వీరిద్దరి నియామకంతో ఎన్నో రోజులుగా జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న ఉత్కంఠతకు తెరవీడింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు నిరాశే మిగిలింది. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి లేకపోతే అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో వెలిచాలకే కాంగ్రెస్ పదవి దక్కుతుందని అందరూ భావించినా ఆయనకు ఆ పదవి లభించలేదు.
ఫ ఏఐసీసీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ
జిల్లాలకు కొత్త కమిటీలు వేయాలని భావించిన తర్వాత టీపీసీసీ ఇందుకోసం షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ మేరకు ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందో అభిప్రాయసేకరణ చేసి దరఖాస్తులను స్వీకరించేందుకు విడివిడిగా పరిశీలకులను పంపించాయి. వారు నాలుగు రోజులపాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం 32 మంది, అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి పేర్లే కాకుండా దరఖాస్తు చేసుకోనివారి గురించి కూడా పరిశీలకులు సమాచారం సేకరించారు. వారు తమ నివేదికను టీపీసీసీకి, ఏఐసీసీకి సమర్పించారు. పరిశీలకుల నివేదికలను పరిశీలించిన టీపీసీసీ ప్రతిపాదించిన అభ్యర్థులను షార్టులిస్ట్ చేసి వారు సూచించిన వారే కాకుండా ఇతరుల పేర్లను కూడా పరిశీలించి ఏఐసీసీకి తమ ప్రతిపాదలనలు పంపించింది. ఏఐసీసీ పలుకోణాల్లో ఆలోచించి జిల్లా సారథులను ప్రకటించింది. అధిష్ఠానం ఆశీస్సులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు లభించడంతో ఆయనను డీసీసీ అధ్యక్ష పదవి వరించింది.
ఫ విప్ పదవి ఆశించినా..
మేడిపల్లి సత్యం మొదటి నుంచి అసెంబ్లీలో పార్టీ విప్ పదవిని ఆశిస్తూ వచ్చారు. అయితే ఆయనకు విప్ పదవి కాకుండా డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. డీసీసీ అధ్యక్ష పదవిలో ఆరు సంవత్సరాలుగా మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన సత్యంకు మళ్లీ ఆ పదవి దక్కింది. అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వైద్యుల అంజన్‌కుమార్ పేరే మొదటి నుంచి వినవచ్చింది. రాజేందర్‌రావుకు డీసీసీ పదవి దక్కకపోతే ఆయనను అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారని మూడురోజులుగా ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా బీసీ సామాజికవర్గానికి చెందిన అంజన్‌కుమార్‌కే ఆ పదవి దక్కింది. ఇప్పటి వరకు ఈ పదవిలో కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను సుడా చైర్మన్‌గా నియమించడంతో ఈసారి అవకాశం కల్పించలేదు. నరేందర్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. ఆయనకు సుడా చైర్మన్ పదవి ఉండడంతోపాటు ఎమ్మెల్యేకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి కలిసి వస్తుందని అధిష్ఠానం ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని దక్కించుకోలేక పోయింది. ఎంపీ పదవిదీ అదే పరిస్థితి. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఖాతా కూడా తెరువలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యేను నియమించి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ పూర్వవైభవాన్ని సాదించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించి ఆ బాధ్యతలను మేడిపల్లి సత్యంకు కట్టబెట్టింది.