వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:39 AM
వైద్యసిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
కథలాపూర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైద్యసిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులను పలకరించి వైద్యులు సేవలందిస్తున్నారా, మందులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న పీహెచ్‌సీ భవనం పనులు ఎందుకు కొనసాగడం లేదని సంబంధిత విభాగం ఇంజినీర్లను ప్రశ్నించారు. డిసెంబరులోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పామని కలెక్టర్‌కు అధికారులు వివరించారు. పీహెచ్‌సీ ఆవరణలో ఏళ్ల కిందట నిర్మించిన శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను తొలగించాలని ఎంపీడీవోకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు సకాలంలో అందుతున్న నేపథ్యంలో పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి సెర్ప్ ద్వారా రుణాలు ఇప్పించేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా చింతకుంట, భూషణరావుపేటలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో కొనసాగుతున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి ఎందుకు పనులు అర్ధాంతరంగా నిలిపివేశారని కాంట్రాక్టర్లను ప్రశ్నించగా రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాగా పాఠశాలలో అదనపు తరగతి గదులు, టీచర్లు, ప్రహారీ, మినీ స్టేడియంకు నిధుల కేటాయించాలని చింతకుంట గ్రామస్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జవాకర్‌రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్‌నాయక్, హౌసింగ్ శ్రీయ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జవ్వాజి రవి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.