సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:09 AM
వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కరీంనగర్, మే 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యంపై తగిన దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు. దోమల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా డెంగీ కేసులు నమోదు అయితే ఆ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆదేశించారు.
ఫ జిల్లాలో అనువైన అన్ని ప్రదేశాల్లో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. వన మహోత్సవంలో భాగంగా జూన్ మొదటి వారం నుంచి జిల్లాలో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అవసరమైన మొక్కలను సరఫరాకు సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
ఫ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు...
జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే వివిధ శాఖల శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎఫ్‌వో బాలమణి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.