మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:49 PM
మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జరిగింది.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. పైవ్రేట్ మెడికల్ స్టోర్స్‌లోనూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ అమ్మకాలను పరిశీలించాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్‌డీఓ మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రైవేట్‌కు ధీటుగా అంగన్‌వాడీ సేవలు
రామడుగు: శిక్షణ పొందిన అంగన్‌వాడీ టీచర్లు ప్రైవేట్‌కు ధీటుగా బోధిస్తున్నారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం, ఇతర విషయాల పట్ల అవగాహన వస్తోందని అన్నారు. తనతో పాటు పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతున్నారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 8 వేల అడ్మిషన్లు పెంచామని తెలిపారు. గ్రామంలోని ప్రతి మహిళ ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిద, తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో రాజేశ్వరి, సీడీపీవో నర్సింగరాణి, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ సుధారాణి, ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ పాల్గొన్నారు.