భక్తులతో కిక్కిరిసిన మల్లన్న క్షేత్రం
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:53 AM
మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం వేలాది మంది భక్తులతో కిక్కిరిసింది. రోహిణి కార్తె ప్రవేశంతో వ్యవసాయ పనులకు సిద్ధమయ్యే ముందు రైతన్నల కుటుంబాలు వేలాదిగా తరలివచ్చి మొక్కులను సమర్పించారు.
ఓదెల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం వేలాది మంది భక్తులతో కిక్కిరిసింది. రోహిణి కార్తె ప్రవేశంతో వ్యవసాయ పనులకు సిద్ధమయ్యే ముందు రైతన్నల కుటుంబాలు వేలాదిగా తరలివచ్చి మొక్కులను సమర్పించారు. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి వాహనాల్లో దాదాపు 20 వేల పైచిలుకు మంది భక్తులు జాతరకు తరలివచ్చి మల్లికార్జున స్వామి, మధన పోచమ్మ, బంగారు పోచమ్మలను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో కోడెలతో ప్రదక్షిణలు నిర్వహించారు. భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి, బోనాలతో మల్లన్నకు సమర్పించారు. క్యూ లైన్‌లో భక్తులు మూడు గంటల సమయం వరకు వేచి ఉండి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భక్తులు బోనాలు సిద్ధం చేసేందుకు, సేదతీరేందుకు సరైన స్థల విస్తీర్ణం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.