ఎస్జీఎఫ్ క్రీడలు విజయవంతం చేయండి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:09 AM
ఎస్‌జీఎఫ్ క్రీడల నిర్వహణలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరూ చురుకుగా పాల్గొని క్రీడల విజయవంతానికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల క్రీడా సమాఖ్య వార్షిక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఎస్‌జీఎఫ్ క్రీడల నిర్వహణలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరూ చురుకుగా పాల్గొని క్రీడల విజయవంతానికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల క్రీడా సమాఖ్య వార్షిక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు సంఘటితంగా క్రీడల నిర్వహణలో మంచి ప్రతిభ చాటుతున్నారన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఎస్జీఎఫ్ క్రీడలను ఈ నెల 18 నుంచి 27వ తేదీలోపు మండల స్థాయిలో, సెప్టెంబరు 15వ తేదీలోపు జిల్లాస్థాయిలో నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు తమవంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు ప్రతి మండలానికి 10 వేల రూపాయల చొప్పున అందించాలన్నారు. క్రీడాకారులకు భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చూడాలని డీఈవోను కోరారు. జిల్లాస్థాయి క్రీడలను వీలైనంతవరకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి వేణుగోపాల్ కార్యదర్శి నివేదికను సమర్పించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం స్వదేశ్‌కుమార్, వ్యాయామ విద్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంతటి శంకరయ్య, ఆడెపు శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.