Share News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:37 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మెట్‌పల్లి పాత బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న రైతులు

- జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రైతుల ధర్నా

మెట్‌పల్లిటౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుంచి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్‌ వద్ద రైతుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్న పంట చేతికి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఽధరలు తగ్గించి 1,600 రూపాయలకే కోనుగోలు చేస్తూ రైతులను నట్టెటా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్‌లో సన్న బియ్యానికి బోనస్‌ విడుదల చేయాలని, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర 2,420 రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దింతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ధర్నా విరమించాలని మెట్‌పల్లి సీఐ అనిల్‌, ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌లు రైతులను నచ్చజెప్పినా వినలేదు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌ ఘటన స్థలానికి చేరుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన రైతులు, రైతు ఐక్య వేదిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:37 AM