Share News

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మహర్దశ

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:14 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్‌ ప్రవేశాలు ఈనెల చివరి వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మౌలిక వసతుల కోసం నిధులు మంజూరయ్యాయి. గతంలో ఎన్‌ఆర్‌డీపీ ద్వారా ప్రతి ఏటా నిధులు వచ్చేవి. పదేళ్లుగా నిధులు రావడం నిలిచిపోయింది.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మహర్దశ

- మౌలిక వసతుల కల్పనకు నిధులు..

- పది కళాశాలలకు రూ.1.80 కోట్లు మంజూరు

- ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,777 మంది చేరిక లక్ష్యం

- ఇప్పటివరకు 63 శాతం మంది విద్యార్థుల చేరిక

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్‌ ప్రవేశాలు ఈనెల చివరి వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మౌలిక వసతుల కోసం నిధులు మంజూరయ్యాయి. గతంలో ఎన్‌ఆర్‌డీపీ ద్వారా ప్రతి ఏటా నిధులు వచ్చేవి. పదేళ్లుగా నిధులు రావడం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం జూనియర్‌ కళాశాలల పరిస్థితిపై, అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై ప్రభుత్వం కోరింది. దాని ప్రకారం పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో 326 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు రూ.56.16 కోట్లు మంజూరుచేసింది. ఇందులో జిల్లాలోని సిరిసిల్ల, కోనరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేటల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు రూ.1.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

మరమ్మతులు.. పారిశుధ్య చర్యలు..

జిల్లాలోని పది జూనియర్‌ కళాశాలలకు మంజూరైన నిధులతో భవనాల మరమ్మతులు, ఇతర సివిల్‌ పనులతో పాటు పారిశుధ్య పనులు మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్‌కు సంబంధించిన పనులు, తాగునీరు, గ్రీన్‌చాక్‌ బోర్డు, డ్యూయల్‌ డెస్క్‌లు, భవనాలకు రంగులు వంటి పనులు చేయనున్నారు. గతంలో కొన్నిచోట్ల అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు కూడా పూర్తికానున్నాయి. జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలు, మంజూరైన నిధుల సద్వినియోగంపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

జిల్లాలో ఇంటర్‌ ప్రవేశాలపై దృష్టి

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలు పెంచే దిశగా ఇంటర్మీడియట్‌ అధికారులు, అధ్యాపకులు దృష్టి సారించారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు ఈనెల చివరి వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని పది జూనియర్‌ కళాశాలలో 1,777మంది విద్యార్థులను చేరే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1,116 మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. అనుకున్న లక్ష్యం చేరే దిశగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య..

- శ్రీనివాస్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. మౌలిక వసతులతో కూడిన భవనాలు ఉన్నాయి. ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలకు నిధులు మంజూరు చేయడం సంతోషకరం. జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,777 మంది విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లాలో జూనియర్‌ కళాశాలలకు మంజూరైన నిధులు

కళాశాల నిధులు(లక్షల్లో)

సిరిసిల్ల(కో-ఎడ్యుకేషన్‌) 23.2

సిరిసిల్ల(బాలికలు) 16.0

కోనరావుపేట 19.1

ఇల్లంతకుంట 12.7

వేములవాడ 24.15

చందుర్తి 18.47

రుద్రంగి 36.9

గంభీరావుపేట 12.5

ముస్తాబాద్‌ 3.85

ఎల్లారెడ్డిపేట 14.4

-------------------------------------------------

మొత్తం 180.82

------------------------------------------------

జిల్లాలో 2025-26 విద్యాసంవత్సరం మొదటి సంవత్సర అడ్మిషన్లు(జూలై 1 వరకు)

కళాశాల లక్ష్యం చేరిన విద్యార్థులు

సిరిసిల్ల 390 312

సిరిసిల్ల (బాలికలు) 123 127

కోనరావుపేట 140 62

ఇల్లంతకుంట 155 84

వేములవాడ 276 134

చందుర్తి 164 72

రుద్రంగి 121 63

గంభీరావుపేట 178 110

ముస్తాబాద్‌ 116 80

ఎల్లారెడ్డిపేట 114 72

--------------------------------------------------------------------------

మొత్తం 1777 1116

------------------------------------------------------------------------

Updated Date - Jul 03 , 2025 | 01:14 AM