Share News

అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:16 AM

జిల్లాలో కొత్తగా 40 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక్కోదానికి 12 లక్షల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టనున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో కొత్తగా 40 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక్కోదానికి 12 లక్షల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఎనిమిది లక్షలు, స్త్రీశిశు సంక్షేమశాఖ నుంచి రెండు లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రెండు లక్షల రూపాయలు భవన నిర్మాణాలకు మంజూరు చేశారు. జిల్లాలోని కరీంనగర్‌, కొత్తపల్లి, గన్నేరువరం, శంకరపట్నం, తిమ్మాపూర్‌, సైదాపూర్‌, హుజూరాబాద్‌ మండలాల్లో ఒక్కొక్క అంగన్‌వాడీ కేంద్రం నిర్మించనున్నారు. గంగాధర మండలంలో 8, రామడుగులో 6, చొప్పదండిలో 5, వీణవంకలో 5, మానకొండూర్‌లో 4, చిగురుమామిడిలో 3, ఇల్లందకుంట మండలంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. ఉన్నవారితోనే ఈ కేంద్రాలను ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఫ జిల్లావ్యాప్తంగా 777 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 311 అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో, 122 కేంద్రాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు వయస్సున్న 32,914 పిల్లలు, 10,089 మంది ప్రీమెట్రిక్‌ పిల్లలు, 4,304 గర్భిణులు, 3,658 మంది బాలింతలు, 22,255 మంది బాలామృత పిల్లలు (ఏడు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు) సేవలు పొందుతున్నారు. 344 కేంద్రాలు అద్దెలేని భవనాల్లో నిర్వహిస్తున్నారు.

ఫ 15 కేంద్రాల అప్‌గ్రేడేషన్‌

అంగన్‌ వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయల కల్పన కోసం 1.34 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌ కోసం 15 కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో ఒక్కో కేంద్రంలో రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తారు. 250 అంగన్‌వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వీటి కోసం ఒక్కో కేంద్రానికి 36 లక్షల రూపాయలను మంజూరు చేశారు. 87 కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఒక్కో కేంద్రానికి 17వేల రూపాయలు ఖర్చుచేసేందుకు నిర్ణయించి ఆ మేరకు మంజూరునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరమ్మతులు చేపట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వెచ్చించాలని నిర్ణయించి కలెక్టర్‌ 5.55 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఇంకా నిధులు విడుదల కావలసి ఉన్నది. ఈ నిధులతో 219 అంగన్‌వాడీ కేంద్రాల్లో సీడీపీవో, ఐసీడీఎస్‌ కార్యాలయంలో మరమ్మత్తులు చేపడతారు. జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమానికి మరమ్మతులు చేస్తారు.

Updated Date - Nov 20 , 2025 | 01:16 AM