Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పొడిగింపు

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:03 AM

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఐదోసారి 25 రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తూ జూన్‌ 30వరకు గడువు పొడిగించింది. ప్రభుత్వం లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద రాయితీతో కూడిన గడువు పొడిగిస్తున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పందన నామమాత్రంగానే కనిపిస్తోంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పొడిగింపు

- ఆదాయం అంచనా రూ.63 కోట్లు

- ఈనెల 30వరకు 25 శాతం రాయితీతో మళ్లీ ఛాన్స్‌

- రాయితీని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఐదోసారి 25 రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తూ జూన్‌ 30వరకు గడువు పొడిగించింది. ప్రభుత్వం లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద రాయితీతో కూడిన గడువు పొడిగిస్తున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పందన నామమాత్రంగానే కనిపిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు సకాలంలో ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగిస్తూ వస్తోంది. అయినా ఆశించిన స్థాయిలో దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడిగిస్తూ అదే చివరిసారిగా పేర్కొంది. అనుకున్న స్థాయిలో ముందుకు రాకపోవడంతో మే 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఇబ్బందులు రావడంతో మళ్లీ జూన్‌ 30వరకు అవకాశం ఇచ్చారు. ఈసారైనా దరఖాస్తుదారులు ముందుకు వస్తారా లేదా వేచి చూడాల్సిందే. అధికారులు మాత్రం ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రూ.63 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.19.61 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు స్సందన నామమాత్రంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఫ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కాని డాక్యుమెంట్లు..

లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ఆదాయం సమకూరుతుందని నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించినా జిల్లాలో ఆశించిన మేరకు స్పందన లభించలేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. యూజర్‌ మాన్యువల్‌ ఫీ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయని చెబుతున్నారు. సర్వర్‌లు బిజీగా ఉండడం, ఆన్‌లైన్‌ ప్రక్రియ ముందుకు సాగకపోవడం ఎదురవుతోంది. మరోవైపు దరఖాస్తుదారులకు నేరుగా ఆటో జనరేట్‌ మేసేజ్‌లు వెళ్లకపోవడం, సర్వర్‌లు మోరాయించడం, వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లు అప్లోడ్‌ కాకపోవడం, ప్లాట్ల వివరాల్లో లోపాలు ఉండటం వంటి ఇబ్బందులను దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దరఖాస్తులు చేసుకున్న వారికి సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఎల్‌ 1 దశలోనే దరఖాస్తులకు బ్రేక్‌లు పడుతున్నాయని వాపోతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు మూడంచెల విధానం ఉండడంతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పథకంగా మారింది. దీంతో పలుమార్లు గడువు ముగిసినా జూన్‌ 30 వరకు మళ్లీ పొడిగించారు. అయితే అధికారుల మధ్య సమన్వయలోపం, దరఖాస్తుదారులను ప్రొత్సహించకపోవడంతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మార్చి 31 వరకు ఇచ్చిన రాయితీ గడువు ముగిసినా ఎల్‌ఆర్‌ఎస్‌ అట్టర్‌ ప్లాప్‌గానే కొనసాగింది. దీంతో ప్రభుత్వం ఏప్రిల్‌ 30 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత మళ్లీ రెండుసార్లు గడువు పొడిగించారు.

ఫ జిల్లాలో 43,150 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 43,150 దరఖాస్తులు వచ్చాయి. 36,661 మంది దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించే విధంగా సమాచారం అందించారు. 5,317 దరఖాస్తులను తిరస్కరించారు. మార్చి 31వరకు రూ 17.33 కోట్లు ఆదాయం ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా సమకూరింది. తరువాత ఏప్రిల్‌ 30 వరకు గడువు ఇచ్చారు. సాంకేతిక సమస్యలతో మే 31 వరకు అవకాశం ఇచ్చారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. రూ.19.61 కోట్ల వరకే పెరిగింది. గడువు పొడిగిస్తున్నా జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ అనుకున్న మేరకు సక్సెస్‌గా ముందుకు వెళ్లడం లేదు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరణ కోసం 43,150 దరఖాస్తులు వచ్చాయి. 2020 సెప్టెంబరులో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రజలపై మోయలేని భారం మోపిందనే అభిప్రాయంతో ఎవరూ దరఖాస్తులు చేసుకున్నా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు సెప్టెంబరు 1, 2020న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 26 ఆగస్టు 2020లోపు సేల్‌డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసిన లేఅవుట్ల యజమానులు, ప్లాట్‌ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఇంటి పన్నులు చెల్లించి క్రయవిక్రయాలు జరిపిన వారు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించే పరిస్థితి నెలకొంది. లేనిపక్షంలో క్రయ విక్రయాలు జరిపే అవకాశం లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిర్ణయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రకటనలు చేసి సర్వేలు చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. గత సంవత్సరం జూలై నెలలో మున్సిపాలిటీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు సమాచారం అందించారు. 25 శాతం రాయితీని ప్రకటించినా అనుకున్న మేరకు వేగం పెరగలేదు. తాజాగా ప్రభుత్వం జూన్‌ 30లోపు 25 శాతం రాయితీతో గడువు పొడిగించింది. లేఅవుట్‌లలో కేవలం పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యి ఉండి, మిగిలినవి రిజిస్ట్రేషన్‌ కాకపోతే 90శాతం ప్లాట్లు క్రమబద్ధీకరణకు అనుమతిస్తున్నారు. చాలా మంది రియల్టర్లు అనుమతి లేఅవుట్‌ ప్లాట్లు కొన్నవారు రూ.10 వేల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత రూ.1000 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం రాయితీతోనైనా ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నా ఆశించిన స్థాయిలో వేగం కనిపించడం లేదు.

ఫజిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం రూ.19.61 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణకు వచ్చిన 43,150 దరఖాస్తుల్లో 36,667 దరఖాస్తుల పరిశీలన పూర్తి నోటీసులు ఇచ్చారు. 5,317 దరఖాస్తులను తిరస్కరించారు. వచ్చిన దరఖాస్తుల్లో సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,526 దరఖాస్తుల్లో 7,654 దరఖాసుదారులకు సమాచారం ఇచ్చారు. ఇందులో 1,442 దరఖాస్తుదారులు రూ.5.12 కోట్లు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 16,390 దరఖాస్తుల్లో 14,065 దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చారు. ఇందులో 3,102 దరఖాస్తుదారులు రూ.6.38 కోట్లు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీల్లో 12,461 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 4,108 దరఖాస్తుదారులు రూ.8.11కోట్లు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 25శాతం రాయితీ ప్రకటించినా దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో భూముల ధరలు ఆశాజనకంగా లేకపోవడం, అమ్మకాలు లేకపోవడం, భూసంబంధ వివాదాలు కేసులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడం వంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 01:03 AM