గజ..గజ
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:55 AM
వామ్మో... ఇదేమి చలి... రెండు, మూడు రోజులుగా చలి వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
- భారీగా పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
- చలితీవ్రత పెరిగే అవకాశం
- జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
కరీంనగర్ టౌన, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వామ్మో... ఇదేమి చలి... రెండు, మూడు రోజులుగా చలి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. చలికాలం ప్రారంభమైననాటి నుంచి ఇంత చలి లేదు... ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు... ఇప్పుడే ఇలా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రత ఎలా ఉంటుందోనంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా జిల్లాలో చలితీవ్రత విపరీతంగా పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతూ ఆది, సోమవారాల్లో 12 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో ప్రజలు చలితీవ్రత తట్టుకోలేకపోతున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశాలున్నాయంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా చలికాలం ప్రారంభం నుంచే చలి రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఈయేడు ఇప్పటి వరకు చలి అంతగా లేదు. రెండు రోజులుగా చలితీవ్రత పెరుగుతూ వచ్చింది. దీనితో చలి తీవ్రతను తట్టుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రతగా ఉండి మధ్యాహ్నం వేళల్లో కొంత తక్కువగా ఉంటుంది.
ఫ ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, పిల్లలు
ఆదివారం సాయంత్రం నుంచి చలితీవ్రత పెరుగగా సోమవారం రోజంతా చలి ఎక్కువగానే ఉండడంతో వృద్దులు, పిల్లలు, మహిళలు, వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజాము పొగమంచు కమ్ముకుంది. చలి ఎక్కువగా ఉండడంతో కూలీలు, కార్మికులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. చలిని తట్టుకునేందుకు మంటకాగడం, ఉన్ని దుస్తులను ధరించడం, చేతులకు, కాళ్లకు గ్లౌజులు వేసుకోవడం, ద్విచక్రవాహనదారులు మంకీ క్యాప్‌లుచ హెల్మెట్లు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు చలితీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నందున తప్పనిసరి అయితే తప్ప రాత్రి వేళల్లో ఇళ్ళ నుంచి బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ రావలసి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తుల వ్యాపారాలు ఊపందుకున్నాయి.