Share News

పల్లెల్లో స్థానిక సందడి

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:54 AM

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెలాఖరు వరకు విడుదలయ్యే అవకాశాలు ఉండడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొన్నది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివిధ వర్గాల ప్రజలను, కుల సంఘాల నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు. గత ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తుండడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎదురుచూస్తున్నారు.

పల్లెల్లో స్థానిక సందడి

- నెలాఖరు వరకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెలాఖరు వరకు విడుదలయ్యే అవకాశాలు ఉండడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొన్నది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివిధ వర్గాల ప్రజలను, కుల సంఘాల నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు. గత ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తుండడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరి రెండవ తేదీతో ముగిసింది. జిల్లా, మండల పరిషత్‌ పాలక వర్గాల పదవీకాలం గత ఏడాది జూలైలో ముగిసింది. అలాగే మున్సిపల్‌ పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి నెలాఖరులో ముగిసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు ఫిబ్రవరిలో ముగియగా వారి పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల వరకు పొడిగించింది.

42శాతం రిజర్వేషన్లపై చర్చ

2023 నవంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగ, విద్యా పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలను సకాలంలో నిర్వహించ లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థలతో పాటు, ఉద్యోగ, విద్యా పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను తీసుకువచ్చింది. రిజర్వేషన్లు కల్పించే విషయమై గడిచిన ఏడాది సెప్టెంబర్‌ అక్టోబర్‌ మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా 55 శాతానికి పైగా బీసీలు ఉన్నారని నిర్ధారణ అయ్యింది. దీనికి చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగల సర్వే ఆధారంగా బీసీలకు ఉద్యోగ, విద్యాపరంగా, స్థానిక సంస్థల్లో రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు అసెంబ్లీలో ఆమోదం తెలిపాయి. ఆ బిల్లును ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి ఆమోదం తెలపకపోగా, దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కలతో కలిపి కులగణన లెక్కలు కూడా తేల్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ 2027 సంవత్సరంలో ముగియనున్నది. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

ఫ పంచాయతీలకు ఆగిపోయిన నిధులు

ఇప్పటికే గ్రామపంచాయతీ పాలకవర్గాల ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించక పోయినా, పార్టీపరంగా 42 శాతం టికెట్లను బీసీలకు ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం కారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నది.

ఫ మొదలైన రైతు భరోసా డబ్బులు జమ

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులను జమచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా జిల్లాలో బుధవారం నాటికి 85 కోట్ల 94 లక్షల రూపాయల నిధులను జమ చేసింది. జిల్లాలో సాగులో ఉన్న భూముల రైతులందరికీ రైతు భరోసా పథకం కింద నిధులను జమ చేసే కార్యక్రమం నడుస్తున్నది. రైతు భరోసాతో స్థానికంగా ప్రభుత్వానికి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నది. వీటి ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజార్టీని సాధించాలని భావిస్తున్నది. రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తుండడంతో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సంకేతాలను ఇస్తున్నది. అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా కూడా స్థానిక నాయకులకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అందుతుండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పల్లెల్లో సందడి చేస్తున్నారు. అయితే ముందుగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయా, గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతాయా అనే విషయమై డైలామా నెలకొన్నది.

Updated Date - Jun 19 , 2025 | 12:54 AM