‘స్థానిక’ సందడి
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:24 AM
బల్దియా ఎన్నికలకు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు.
కరీంనగర్ టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బల్దియా ఎన్నికలకు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కానీ నగరంలో పలు డివిజన్లలో అప్పుడే ఎన్నికల కోలాహాలం కనిపిస్తోంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలపై అధికారులకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 30లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. దీంతో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లేదా ఆ తర్వాత కొద్ది రోజులకైనా మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని రాజకీయ శ్రేణులు భావిస్తున్నారు. మరికొందరు అక్టోబరు, నవంబరు లేదా ఈ ఏడాది చివరలో తప్పకుండా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, హైకోర్టు ఈ ఎన్నికలపై జోక్యం చేసుకుంటుందని ఢంకా బజాయించి చెబుతున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులంతా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. అటు గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకోగా ఇటు మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది. కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేయాలకునే ఔత్సాహికులంతా అప్పుడే ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు.
ఫ సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
కరీంనగర్ కార్పొరేషన్‌లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు శివారు గ్రామాలను విలీనం చేసి 66 డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడంతోనే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు ఎంఐఎం, వామపక్షాలు తమ ద్వితీయశ్రేణి నాయకులకు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చాయి. ప్రజల్లోకి వెళ్లి కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తూ మరోవైపు మాజీ కార్పొరేటర్లు, విలీన కొత్తపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫ మారిన డివిజన్ల స్వరూపం
డివిజన్ల స్వరూపం మారడంతో కొత్తగా ఏర్పడిన డివిజన్లలో ఈసారి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కొత్తగా బరిలోకి దిగేందుకు ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయో, డివిజన్లలో రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉంటుందో లేదో, రిజర్వేషన్ల వెల్లడి తర్వాత ఆలోచిస్తామనుకునేవారు కొంతమంది ఉన్నారు. డివిజన్ల ఓటర్లను పరిశీలించి తప్పకుండా రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందనుకునే నాయకులు, కొత్తగా పోటీచేయాలనుకునేవారు అప్పుడే సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని షురూ చేశారు. కొందరు డివిజన్లలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ఓటర్లతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు వారికి గుడ్ మార్నింగ్, పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో తాను ఈ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను, ఆశీర్వదించడంటూ ప్రచారం చేసుకుంటున్నారు. డివిజన్లలో తిరుగుతూ తనకు అనుకూలంగా ఉందని, పోటీ చేయాలని అందరూ ఒత్తిడి చేస్తున్నారంటూ మీ సహకారం ఉండాలని కోరుతున్నారు. ఆయా డివిజన్లలోని సమస్యలపై తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని, తను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానంటూ అప్పుడే హామీలు గుప్పిస్తున్నారు.
ఫ మళ్లీ అవకాశం ఇవ్వాలంటున్న మాజీలు
మాజీ కార్పొరేటర్లు మరోసారి తమకే అవకాశమిస్తారని భావిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆఈర్‌ఎస్ మూడు పార్టీలతోపాటు ఎంఐఎం కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో పార్టీ టికెట్ల కేటాయింపులో ఈసారి తీవ్ర పోటీ ఉంటుందని భావిస్తుండడంతో అప్పుడే ఐఔత్సాహికులు నేతల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. డివిజన్‌లో ఆయా పార్టీల్లో పోటీ చేసేందుకు ఎవరు ఉత్సాహంగా ఉన్నారో ఆరా తీస్తున్నారు. కొన్ని డివిజన్లలో పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నాయకులు వేరే పార్టీలో చేరడమా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా అని ఆలోచిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందని ఇప్పటికే నేతలు తమకు హామీ ఇచ్చి పని చేసుకోమ్మనన్నారని, డివిజన్ ప్రముఖులు, వాకర్స్, ఓటర్లను ప్రభావితం చేసే కాలనీ వెల్ఫేర్ సంఘాలు, అపార్ట్‌మెంట్ సంఘాలను కలుస్తూ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రోజురోజుకు డివిజన్లలో ఎన్నికల వేడి రాజుకుంటుంది.