Share News

‘స్థానిక’ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:15 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘స్థానిక’ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

కరీంనగర్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతిప్రతినిది): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన విజయవంతంగా చేపట్టేందుకు సిధ్దంగా ఉండాలని అన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందకు సాగాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా అనుమానాలు, సందేహాలు, ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద సరిపడా స్ట్రాంగ్‌ రూమ్‌లు, బ్యాలెట్‌ బాక్సులు, తాగునీరు, మరుగుదొడ్లు, వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన ఇతర సామాగ్రిని అందుబాటులో ఉండే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల వేళ ఎలాంటి పొరపాట్లకు తావ్వికుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. స్థానిక సంస్థల అదనపుకలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే మాట్లాడుతూ హ్యాండ్‌ బుక్‌లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఫ సైన్‌ లాంగ్వేజీశిక్షణ అభినందనీయం

-ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌ శాంతికుమారి

జిల్లాలో ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచేందుకు సైన్‌ లాంగ్వేజీ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మావన వనరుల అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌ శాంతికుమారి అన్నారు. శుక్రవారం నగరంలోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించి, ఇక్కడ ఇస్తున్న శిక్షణ వివరాలను కలెక్టర్‌ పమేలాసత్పతిని అడిగి తెలుసుకున్నారు. సైన్‌ లాంగ్వేజీ శిక్షణ ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఉపాధ్యాయులు, ఆసుపత్రి సిబ్బంది, బధిర విద్యార్థుల తల్లిదండ్రులకు ఇస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఉన్న సౌకర్యాలు, శిక్షణ విధానం, శిక్షణకు అవసరమైన ఉద్యోగుల ఎంపిక తదితర వివరాలపై శాంతికుమారి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్వినీ తానాజీ వాఖడే, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్‌, ప్రాంతీయ శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్‌ రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:15 AM