Powerloom Workers: పవర్‌లూం కార్మికులకు.. రుణమాఫీ వర్తింపజేయాలి
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:13 AM
చేనేత కార్మికులతో పాటు పవర్‌లూం కార్మికులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని లాల్ బాహుట చేనేత పవర్ లూం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికులతో పాటు పవర్‌లూం కార్మికులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని లాల్ బాహుట చేనేత పవర్ లూం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మికు భవనంలో విలేకరుల సమావేశంలో రవి మాట్లాడారు. చేనేత కార్మికులకు లక్ష రూపాయాల రుణమాఫీ చేయడాన్ని, పవర్ లూం కార్మికులకు చేతి నిండ పని కల్పించడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు జత చీరలను ఇవ్వడానికి బీసీ సంక్షేమ సంఘం నుంచి రూ. 318 కోట్లు రుణాలను ప్రభుత్వం విడదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పవర్‌లూం కార్మికులు సిరిసిల్ల ప్రాంతంలో పవర్‌లూం పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసి న తప్పిదాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఒడిదుడుకులను ఎదుర్కోవడం ఫలి తంగా సిరిసిల్లలోని కార్మికులకు రెండు సంవత్సరాలుగు ఉపాధి లేకుండా పోయిందని ఆరోపించారు. దీంతో పవర్‌లూం కార్మికులు ఇటీవల చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు, రైతులకు ప్రభుత్వం ఏ విధంగా వ్యక్తిగత రుణాలను మాఫీ చేసిందో ఆదే మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం పవర్ లూం కార్మికుల వ్యక్తిగత రుణాలను సైతం మాఫీ చేసి పవర్‌లూం కార్మిక కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవర్‌లూం కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి పవర్‌లూం కార్మికునికి ఎంటువంటి నియమ నిబంధనాలు లేకుండా రూ. 5వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు అజ్జ వేణు, నల్ల చంద్ర మౌళి, రాయమల్లు, రాజు పాల్గొన్నారు.