Share News

కిటకిటలాడుతున్న ఎల్‌ఎండీ...

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:21 AM

కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయం కట్ట వద్ద సందర్శకులు పోటెత్తారు. మానేరు జలాశయం నిండుకుండలా కళకళలాడుతున్నది.

కిటకిటలాడుతున్న ఎల్‌ఎండీ...

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయం కట్ట వద్ద సందర్శకులు పోటెత్తారు. మానేరు జలాశయం నిండుకుండలా కళకళలాడుతున్నది. ఎల్‌ఎండీ పూర్తినీటి నిలువ సామర్థ్యం 24.034 కాగా ప్రస్తుతం 21 టీఎంసీలపైగా నీటితో నిండుగా ఉంది. మరో టీఎంసీ వరకు నీరు ఎగువ నుంచి వస్తే ప్రాజెక్టు గేట్లు ఎత్తి మానేరు నదిలోకి వదిలే అవకాశముంది. వర్షాలు, వరదలతోపాటు దిగువ మానేరు జలాశయంలోకి పెద్ద ఎత్తున చేరడంతో ఒక్కసారిగా నిండుకుండలా మారింది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. రోజంతా కష్టపడిన కరీంనగర్‌వాసులకు అహ్లాదకరమైన ప్రాంతంగా మానేరు జలాశయం, జింకల పార్కు, ఉజ్వల పార్కులు అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయం కట్టపై నుంచి జలాశయం నీటిని, దూరాన కొండలను, చిన్నగా తుంపర్ల వర్షం, కమ్ముకున్న మేఘాలతో చల్లటి వాతావరణం ఆదివారం సాయంత్రం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచి పెడుతోంది.

ఫ హుషారుగా బోటు షికారు....

మానేరు జలాశయంలో టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటు షికారులో యువత, సిల్లలతో కలిసి కుటుంబాలు హుషారుగా పాల్గొంటున్నారు. మామూలు బోటుతోపాటు స్పీడ్‌ బోట్లను టూరిజంశాఖ అందుబాటులో ఉంచింది. మామూలు బోటులో 25 నుంచి 30 మంది వరకు వెళ్లవచ్చు. స్పీడ్‌ బోటులో నలుగురు ప్రయాణించటానికి సౌకర్యంగా ఉన్నది. స్పీడ్‌ బోటులో జలాశయంలో 20 నిమిషాలపాటు షికారు చేయటానికి నలుగురికి 350 రూపాయలు చార్జిని వసూలు చేస్తుండగా మామూలు బోటులో షికారుకు పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయల చార్జిని వసూలు చేస్తున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటలకు వరకు మానేరు జలాశయంలో బోటు షికారు చేయవచ్చు.

ఫ జలాశయం కట్టపై ఉదయం , సాయంత్రం వాకర్స్‌ సందడి

కరీంనగర్‌ శివారు ప్రాంతంలోని మానేరు జలాశయం కట్టపై సుందరంగా తీర్చిదిద్దిన తారు రోడ్డు, విద్యుత్‌దీపాలు, బెంచీలతో పాటు మంచి వాతావరణం ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కరీంనగర్‌కు చెందిన వాకర్స్‌ సందడి ఉంటుంది. వేకువజామున నాలుగు గంటల నుంచే మహిళా వాకర్స్‌ నడకకు బయలుదేరుతారు. ఉదయం 8 గంటల వరకు వాకర్స్‌తో జలాశయం కట్ట నిండిపోతుంది. ఉదయం రెండు వేల మంది నడకకు వస్తున్నారు. ఇక్కడి వచ్చే వాకర్స్‌తో మానేరు వాకర్స్‌, లేక్‌ వాకర్స్‌ అనే రెండు అసోసియేషన్లు ఏర్పాటయ్యాయి. ఈ రెండు అసోసియేషన్ల ఆధ్వర్యంలో శ్రమదానం, స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:21 AM