Share News

నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలి

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:07 AM

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు.

నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలి

కరీంనగర్‌ క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. తమ మార్గాన తాము వెళుతున్న సమయంలో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారితో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం నగరంలోని కోర్టు చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆవుల రవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఫ అతి వేగంగాట్యాంకర్లు, ట్రాక్టర్లు, టిప్పర్లు

నగరంలో లారీలు, ట్యాంకర్‌లు, ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు అతివేగంగా నడుపుతుండడంతో రోజుకో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్రగాయాలపాలవుతూనే ఉన్నారు. ఇటీవల కేబుల్‌ బ్రిడ్జి చౌరస్తా వద్ద ఒక కారు రోడ్డుదాటుతున్న వ్యక్తిని ఢీకొట్టగా అతని రెండు చేతులు విరిగాయి, పక్కటెముకలు, కాలుకు గాయాలయ్యాయి. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యలకు గురైంది. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కరీంనగర్‌ సిటీతోపాటు శివారులోని బైపాస్‌ రోడ్‌లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

ఫ - రాత్రివేళలో బైక్‌లతో విన్యాసాలు రేస్‌లు

నగరంలో కొందరు యువకులు ట్రాఫిక్‌ మద్య నుంచే విపరీతమైన శబ్ధం చేసుకుంటూ బైక్‌లతో విన్యాసాలు చేస్తున్నారు. అటువంటి వారిని పట్టుకునే వారే లేకుండా పోయారు. నగర శివారులోని మానేరు బైపాస్‌రోడ్‌, బొమ్మకల్‌ బైపాస్‌రోడ్‌, పెద్దపల్లి బైపాస్‌ రోడ్‌, యల్లాపూర్‌, చింతకుంట బైపాస్‌రోడ్‌లలో నిత్యం రాత్రి వేళల్లో బైక్‌ రేసులు నడుస్తున్నాయి. మానేరు బైపాస్‌రోడ్‌, చింతకుంట-మల్కాపూర్‌ బైపాస్‌రోడ్‌లలో బైక్‌ రేసుల కారణంగా పలువురు యువకులు మృత్యువాతపడిన సంఘటనలు ఉన్నాయి.

ఫ ట్రాఫిక్‌ను నియంత్రణపై నిర్లక్ష్యం

నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారైంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను, ట్రాఫిక్‌ నిబంధనలు సరిగా అమలు కావటంలేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు, డ్రంకెన్‌డ్రైవ్‌లపై పెడుతున్న శ్రద్దను అతివేగంగా నడిపే వాహనదారులు, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే యువకులపై చూపడం లేదని నగర వాసులు అంటున్నారు. చలాన్లు విధించడం, డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించడం ముఖ్యమే అయినా ట్రాఫిక్‌ను నియంత్రించడమూ కీలకమే..

ఫ ఆక్రమణలకు గురవుతున్న ఫుట్‌పాత్‌లు

కరీంనగర్‌లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. చిరు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద వ్యాపారులు తమ దుకాణాల ముందు ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించి సామగ్రిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాదచారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి దుకాణాలు, పూర్తిగా తొలగించడంతో పాటు చిరువ్యాపారులు ప్రత్యేక స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించుకునేలా ట్రాఫిక్‌పోలీసులు, మున్సిపల్‌ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ఇప్పటికే టవర్‌సర్కిల్‌, కూరగాయ మార్కెట్‌ ఏరియాలో రోడ్లపైనే వీధి వ్యాపారాలు నిర్వహించుకుంటుండటంతో అక్కడ నిత్యం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విపరీతమైన రద్దీ నెలకొంటున్నది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తొలగిస్తున్నా ఒకటి, రెండ్రోజుల తరువాత తిరిగి ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2025 | 01:07 AM