పత్తిపాక రిజర్వాయర్‌కు లైన్‌క్లియర్
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:34 AM
ద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీ నరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కోటి 10 లక్షల రూపా యల నిధులను మంజూరు చేస్తూ ఈ నెల 2వ తేదీన జీవో ఆర్టీ నెంబర్ 154 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీ నరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కోటి 10 లక్షల రూపా యల నిధులను మంజూరు చేస్తూ ఈ నెల 2వ తేదీన జీవో ఆర్టీ నెంబర్ 154 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సీడబ్ల్యుసీ నిబంధనలను అనుసరించి డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే విధంగా ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాకకు ముందే ఉత్తర్వులు వెలువడడం ప్రాధాన్యతను సంత రించుకున్నది.
పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లా లోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లా కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ డి-83 నుంచి డి-94 వరకు గల 2 లక్షల 40 వేల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయ కట్టుకు సాగునీటిని అందించేందుకు దీనిని ప్రతిపాదిం చారు. ఎస్సారెస్పీ నిండే వరకు ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పత్తిపాక రిజర్వాయర్ తప్పనిసరి అయ్యింది. ఎస్సారెస్పీ నిండినా, నిండక పోయినా గోదావరి నీటిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పత్తిపాకకు తరలిం చుకుని సాగునీటిని సరఫరా చేస్తే రైతులకు సాగు నీటికి ఢోకా ఉండదని ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు డీపీఆర్‌కు ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత జీవో జారీ చేసింది.
ఫ పత్తిపాకపై రైతుల ఆశలు
పత్తిపాక రిజర్వాయర్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పత్తిపాక వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించి ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించాలనే ప్రతి పాదన గత ప్రభుత్వ హయాంలోనే ఉన్పప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి పంప్‌హౌస్‌ల ద్వారా శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే విధంగా రూపకల్పన చేశారు. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి నంది మేడారం వద్ద నిర్మించిన పంప్‌హౌస్, రామడుగు మండలం లక్ష్మి పంప్‌హౌస్ వద్ద నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ ద్వారా శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పిల్లర్ల వరద ధాటికి కుంగిపోగా, అన్నారం బ్యారేజీ వద్ద బుంగ పడింది. సుందిళ్ల బ్యారేజీ కూడా నిర్మాణంలో లోపాలు ఉన్నా యని ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నింపడం లేదు. అయినా శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చిన వరదల వల్ల నీటిని మిడ్ మానేరుకు పంపింగ్ చేశారు. అయితే పత్తిపాక వద్ద 5 నుంచి 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గా ల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలన్నా ప్రతి పాదనకు మోక్షం లభించలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పత్తిపాక రిజర్వాయర్‌పై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మించాలని మంథనికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌తో కలిసి ప్రభుత్వం ముందుకు తీసుక వచ్చారు. దీంతో గత ఏడాది నవంబర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు సహ ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదిత పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించి దాని ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడే డీపీఆర్‌కు ఆదేశించినప్పటికీ, సునిశితంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ నెల 2న డీపీఆర్ తయారీకి ఉత్తర్వులు జారీ చేసింది.
ఫ రెండు పంపు హౌస్‌లతో ప్రతిపాదనలు
పత్తిపాక రిజర్వాయర్‌పై ఆరు మాసాలుగా కసరత్తు చేస్తున్న నీటి పారుదల శాఖాఽధికారులు ఒక ప్రతి పాదన సిద్ధం చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్ పరిధిలో గోదావరి ఒడ్డున ఉండే వెల్గటూర్ నుంచి దేవికొండ మీదుగా నీటిని పత్తిపాక వద్ద నిర్మించే రిజర్వాయర్‌లోకి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. శ్రీపాద ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ సామర్థ్యంతో చిన్న రిజర్వాయర్ నిర్మించి అక్కడ ఒక పంప్ హౌస్ నిర్మించి అక్కడి నుంచి నీటిని వెల్గటూర్ నుంచి దేవికొండ వరకు నిర్మించే గ్రావిటీ కాలువలోకి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఎత్తు ప్రదేశంలో ఉండే దేవికొండ వద్ద 1.10 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్‌లోకి ఎత్తి పోయాలని, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం పత్తిపాక రిజర్వా యర్‌లోకి నీటిని సరఫరా చేసేందుకు ఒక పంప్ హౌస్‌లోకి ఎత్తిపోయాలని డిజైన్ రూపొందించారు. అక్కడి నుంచి కాకతీయ ప్రధాన కాలువలోకి నీటిని గ్రావిటీ ద్వారా సరఫరా చేయనున్నారు. అలాగే ప్రత్యా మ్నాయంగా వరద కాలువకు వరద ఎక్కువైతే, తద్వారా పత్తిపాక రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం సీడబ్ల్యూసీ నిబంధనలు, జియాలాజికల్, బయోమెట్రీ ఆధారంగా డీపీఆర్‌ను తయారు చేయాలని ఆదేశించ డంతో అధికారులు తాత్కాలికంగా రూపొందించిన ప్రతిపాదనల్లో చేర్పులు, మార్పులు జరిగే అవకాశాలున్నాయి.