Share News

చేప పిల్లల పంపిణీకి లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:45 AM

మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీపై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. ఆలస్యంగా నైనా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కావాల్సిన చేప పిల్లల కోసం జిల్లా మత్స్య శాఖాధికారులు ఈ నెల 18వ తేదీన అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది.

చేప పిల్లల పంపిణీకి లైన్‌ క్లియర్‌

చేప పిల్లల పంపిణీకి లైన్‌ క్లియర్‌

- సెప్టెంబర్‌ 1 వరకు గడువు, అదే రోజు టెండర్లు ఖరారు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీపై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. ఆలస్యంగా నైనా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కావాల్సిన చేప పిల్లల కోసం జిల్లా మత్స్య శాఖాధికారులు ఈ నెల 18వ తేదీన అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది. సెప్టెంబరు 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించింది. అదే రోజు టెండర్లను ఓపెన్‌ చేసి ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా డిమాండ్‌ ఉన్న రోహు, బొచ్చ, బంగారు తీగ రకాల చేప పిల్లలను పెంచనున్నారు. జిల్లాలో అనేక మంది మత్స్యకారులు చేప పిల్లల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఫ జిల్లాలో 145 మత్స్యకారుల సహకార సంఘాలు

జిల్లాలో 145 మత్స్యకారుల సహకార సంఘాలు ఉండగా, వీటిలో 11,397 మంది మత్స్యకారులు ఉన్నారు. 38 మహిళా మత్స్యకార సహకార సంఘాలు ఉండగా, వీటిలో 1899 మంది సభ్యులు ఉన్నారు. అలాగే 15 మత్స్యకారుల లైసెన్స్‌ హోల్డర్‌ మార్కెటింగ్‌ సొసైటీలు ఉండగా, ఇందులో 660 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో పెద్ద చెరువులు, చిన్న చెరువుల్లో చేపలు పెంచుకునేందుకు మత్స్యకా రులకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం లీజుకు ఇస్తున్నది. తద్వారా ప్రభుత్వానికి 11 లక్షల 56 వేల 646 రూపాయల లీజు వస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో గల 1,076 చెరువులు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేప పిల్లల ఉత్పత్తి కోసం మత్స్యకా రులకు మొత్తం ఒక కోటి 58 లక్షల 82 వేల చేప పిల్లలు మత్స్యకారుల ద్వారా పెంచాలని నిర్ణయించారు. 85 నుంచి 100 ఎంఎం సైజు గలవి 56 లక్షల 80 వేల చేప పిల్లలు, 35 నుంచి 40 ఎంఎం సైజు గలవి కోటి 2 లక్షల 2 వేల చేప పిల్లల కోసం టెండర్లు పిలిచారు. పెద్దవి లక్ష చేప పిల్లలకు 1,66,130 రూపాయలు, చిన్నవి లక్ష చేప పిల్లలకు 62,670 రూపాయల ధర నిర్ణయించారు.

ఫ పదేళ్లుగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ

మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2015 నుంచి ఉచితంగా చేప పిల్లల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతేగాకుండా గతంలో చెరువులు, కుంటలను లీజుకు ఇచ్చి ప్రతి ఏటా మత్స్యకార సహకార సంఘాల నుంచి డబ్బులు వసూలు చేసే వారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదేళ్లకోసారి మాత్రమే లీజు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించి వసూలు చేసింది. మొదట చేప పిల్లల పంపిణీ బాగానే జరిగినప్పటికీ, ఆ తర్వాత పంపిణీలో జాప్యం జరగడంతో పాటు నాణ్యత లేనివి, తక్కువ సైజు గల చేప పిల్లలను కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. చేప పిల్లలకు బదులు నగదు డబ్బులు ఇవ్వాలని కొంత కాలంగా మత్స్యకార సహకార సంఘాల నాయకులు కోరుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వర్షాలకు ఎప్పుడు చెరువులు, కుంటలు నిండుతాయో ఆ వెంటనే మత్స్యకారులు ప్రభుత్వ, ప్రైవేట్‌ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి అందులో పోసుకునే వెసులు బాటు ఉంటుంది. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లేనప్పుడు, గతంలో మత్స్యకారులు చేప పిల్లలను కొనుగోలు చేసి పెంచి ఉపాధి పొందే వారు. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తున్నదని మత్స్యకారులు అంటున్నారు.

ఫ పంపిణీలో జాప్యం

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో ఆలస్యంగా నాణ్యత లేని, తక్కువ సైజు గల చేప పిల్లలను కాంట్రాక్టర్లు తీసుకురావడంతో వాటిని మత్స్యకారులు తిరస్కరించారు. చెరువుల్లో చేప పిల్లలు పోయకుండా వెళ్లగొట్టారు. అదను దాటిన తర్వాత చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీలో ఇప్పటికే జాప్యం జరిగింది. వాస్తవానికి టెండర్ల ప్రక్రియ జూలై నెలాఖరు వరకు పూర్తి చేస్తే ఆగస్టు మొదటి, రెండవ వారంలో చేప పిల్లల పంపి ణీ పూర్తయి ఉండేది. అయినా నెల రోజులు ఆలస్యంగా టెండర్లు పిలిచారు. ఈసారి టెండర్లు పిలవరని, చేప పిల్లలకు బదులు ప్రభుత్వం నగదు సరఫరా చేస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించారు. ఈసారైనా టెండర్లు దక్కించు కునే కాంట్రాక్టర్లు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత గల చేప పిల్లలను సరఫరా చేసే విధంగా జిల్లా మత్స్యశాఖాధికారులు చొరవ తీసుకోవాలని మత్స్యకా రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖాధికారి నరేష్‌ కుమార్‌ నాయుడు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ జిల్లాలో గల మత్స్యకారులకు కోటి 58 లక్షల 82 వేల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించామని, కావలసిన చేప పిల్లల కోసం టెండర్లను ఆహ్వానించామని, సెప్టెంబర్‌ ఒకటవ తేదీ గడువు ఉందన్నారు. నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:45 AM