Share News

మద్యం దుకాణాలకు లైసెన్సుల ఖరారు

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:25 AM

జిల్లాలోని 94 మద్యం దుకాణాలకు లైసెన్స్‌దారులను ఎంపిక చేసే లాటరీ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది.

మద్యం దుకాణాలకు లైసెన్సుల ఖరారు

- 94 వైన్‌షాపులకు రూ. 55.45 కోట్ల లైసెన్సు ఫీజు

- దుకాణాలు దక్కించుకున్న 23 మంది మహిళలు

- సంబరాల్లో షాపులు పొందిన వ్యాపారులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలోని 94 మద్యం దుకాణాలకు లైసెన్స్‌దారులను ఎంపిక చేసే లాటరీ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. షాపులు దక్కినవారు సంబరాల్లో మునిగితేలగా... డ్రాలో దుకాణం రాని వారు మూడు లక్షల రూపాయల దరఖాస్తు రుసుం కోల్పోయి నిరాశతో వెనుదిరిగారు. లక్కు ఎవరిదో తేలింది. మద్యం వ్యాపారంలో ఆరితేరిన వారితోపాటు కొత్తగా మద్యం వ్యాపారంలోకి అడిగిడిన వారు మద్యం దుకాణాల కోసం పోటీ పడడంతో దరఖాస్తులు భారీగా అందాయి. జిల్లాలోని 94 వైన్‌ షాపుల లైసెన్సుల కోసం టెండర్లు నిర్వహించగా 2,730 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల చొప్పున ఫీజు చెల్లించడంతో దరఖాస్తుల ద్వారా 81 కోట్ల 90 లక్షల రూపాయల ఆదాయం సర్కారుకు సమకూరింది. 2023-25 సంవత్సరంలో నిర్వహించిన టెండర్లలో 94 వైన్‌షాపులకు 4,040 దరఖాస్తులు అందాయి. అప్పుడు దరఖాస్తుఫీజు 2 లక్షలుండగా ప్రస్తుతం దరఖాస్తుఫీజును 3 లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. గతంలోకంటే దరఖాస్తులు తక్కువగా వచ్చినప్పటికీ ఆదాయం ఒక కోటి 10 లక్షల రూపాయల ఆదాయం అధికంగా వచ్చింది. దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచడంతో జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ఒక్కో గ్రూపు తరపున 50 నుంచి 150 వరకు దరఖాస్తులు చేశారు.

ఫ కలెక్టరేట్‌లో డ్రా

సోమవారం మద్యం షాపులను ఖరారు చేయడానికి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియను చేపట్టారు. కలెక్టర్‌ పమేలా సత్పతి ఉదయం 11 గంటలకు లాటరీ తీయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ మద్యాహ్నం 1:30 గంటలకు ముగిసింది. గెజిట్‌ నంబర్‌ 1కు వచ్చిన దరఖాస్తుదారుల పేర్లను పిలిచి అనంతరం దరఖాస్తులకు కేటాయించిన నంబర్లను ఒక స్టీల్‌ డబ్బాలో వేసి లాటరీ విధానంలో అందులో నుంచి కలెక్టర్‌ ఒక నంబర్‌ను బయటకు తీసి ఆ షాపు లైసెన్స్‌దారుడిని ఖరారు చేశారు. ఇదే విధంగా జిల్లాలోని 94 వైన్‌షాపులకు లైసెన్స్‌దారులను కలెక్టర్‌ స్వయంగా డ్రా తీసి ఖరారు చేశారు. 94 మద్యం దుకాణాల్లో ఎస్సీలకు 9, గౌడ కులస్థులకు 17 షాపులను కేటాయించారు. మిగతా 68 దుకాణాలు జనరల్‌ కేటగిరీకి రిజర్వు చేశారు. ఈ లాటరీ ప్రక్రియ అంతటిని ఎల్‌ఈడీ స్ర్కీన్లపై అందరు చూసే విధంగా ప్రదర్శించారు. లాటరీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కలెక్టర్‌ పమేలా సత్పతి ఆడిటోరియంలోనే ఉన్నారు. 94 వైన్‌షాపులకు లైసెన్స్‌ల కోసం 2,730 దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా మొత్తం దుకాణాలకు లైసెన్స్‌దారులను ఎంపిక చేశారు. మొత్తం 94 వైన్‌షాపుల్లో 23 మంది మహిళలు లైసెన్స్‌లను దక్కించకోవడం గమనార్హం. మిగతా 71 మంది పురుషులు వైన్‌షాపుల లైసెన్సీలుగా ఎంపికయ్యారు. మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు 2,730 మంది దరఖాస్తుదారులతోపాటు వారి అనుచరులు, స్నేహితులు, వ్యాపారులు కలిసి మూడు వేలపైగా మంది భారీ సంఖ్యలో కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని ఆడిటోరియం వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. కరీంనగర్‌ వన్‌టౌన్‌ సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఆడిటోరియం వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎంట్రీపాస్‌ ఉన్నవారినే లోపలికి అనుమతించారు. లాటరీ ప్రక్రియముగియగానే ఆయా దరఖాస్తుదారులను బయటకు పంపించారు.

ఫ ప్రభుత్వానికి భారీగా ఆదాయం

జిల్లాలో ప్రస్తుతం 94 వైన్‌షాపుల లైసెన్స్‌లు ఖరారు కాగా ఎక్సైజ్‌ శాఖకు ఏడాదికి 55.45 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనున్నది. 11 వైన్స్‌కు 50 లక్షల వంతున 5.5 కోట్లు, మరో 40 షాపులకు 55 లక్షల వంతున 22 కోట్లు, 43 షాపులకు 65 లక్షల వంతున 27.95 కోట్ల రూపాయలు లైసెన్స్‌ ఫీజు కింద ఆదాయం సమకూరనున్నది. ఈ ఫీజులో ఆరు వంతు డబ్బులు లైసెన్స్‌దారులు మంగళవారంలోగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రూపంలో ఏడాదికి మొత్తం 55.45 కోట్ల రూపాయలు సమకూరనుండగా, 2,730 దరఖాస్తుల ద్వారా 81.9 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం సమకూరింది. ఈ 94 వైన్‌షాపులు 5 లక్షల వంతున 4.7 కోట్ల రూపాయలు స్పెషల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కలిపి మొదటి ఏడాదిలో 142.05 కోట్ల ఆదాయం సమకూరనుంది.

ఫ లక్కంటే వెంకటేష్‌దే....

కరీంనగర్‌లోని రాంనగర్‌ వైన్‌షాపు గెజిట్‌ నంబరు 19 (రిజర్వు గౌడ్‌)కి 37 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ షాపు లైసెన్స్‌ కోసం కొత్తపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పల్లె వెంకటేశం అనే వ్యక్తి ఒకటే దరఖాస్తు చేయగా ఆయనకే ఈ షాపు దక్కింది. లాటరీ ప్రక్రియలో 37 మంది టోకెన్లను డబ్బాలోవేసి కలెక్టర్‌ ఒక టోకెన్‌ను తీయగా వెంకటేష్‌ నంబర్‌(టోకెన్‌ 27) వచ్చింది. 50, 100 సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న గ్రూపులు, వ్యక్తులకు దక్కని షాపులు సింగిల్‌ టెండర్‌ వేసిన తనకు రావడంపై వెంకటేశం ఆనందం వ్యక్తం చేశాడు. వెంకటేశం ప్రస్తుతం విద్యానగర్‌లో వైన్‌షాపును నిర్వహిస్తున్నాడు.

ఫ మొదటి వైన్‌ షాపు లైసెన్స్‌ మహిళకు..

జిల్లాలో 94 వైన్‌షాపలుండగా కరీంనగర్‌ అర్బన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో నుంచి గెజిట్‌ నెంబర్‌-1 షాపు ప్రారంభమైంది. కరీంనగర్‌ విద్యానగర్‌, వావిలాలపల్లి, జ్యోతినగర్‌ల క్లస్టర్‌కు కలెక్టర్‌ లాటరీ ద్వారా టోకెన్‌(లోకెన్‌ నంబరు16)ను తీయగా పెద్దపల్లి జిల్లా కాట్నపల్లికి చెందిన పొన్నాల సంతోషకు అదృష్టం వరించింది. మొదటిషాపు మహిలకు రావడం గమనార్హం.

Updated Date - Oct 28 , 2025 | 01:25 AM