రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:51 AM
రాజకీయాలకు అతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు బలహీనవర్గాల ఉద్యోగులు, యువత, రైతులు, వివిధ రంగాల్లో ఉన్న వారంతా సంఘటితమై జేఏసీలుగా ఏర్పడి పోరాటం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ భారత్‌జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని అసమానతలు గమనించారన్నారు.
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు బలహీనవర్గాల ఉద్యోగులు, యువత, రైతులు, వివిధ రంగాల్లో ఉన్న వారంతా సంఘటితమై జేఏసీలుగా ఏర్పడి పోరాటం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ భారత్‌జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని అసమానతలు గమనించారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపట్టి కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి పంపించిందన్నారు. ప్రభుత్వపరంగా తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వరిస్తున్నామని తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీలో కార్యక్రమమే కాకుండా బిల్లు ఆమోదంపొందే వరకు ఉద్యమం కొనసాగాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే తమకు రాజకీయ ఉనికి ఉండదనే వాతావరణం కలుగజేసే బాధ్యత ప్రతి బలహీనవర్గాల బిడ్డపై ఉందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కవితవి కంటితుడుపు చర్యలని, కడుపులో కత్తులు పెట్టుకుని అడ్డుకోవడం వద్దు అని అన్నారు. నిర్ణయం ఆగిన వద్ద అడగకుండా హైదరాబాద్‌లో ధర్నాలు చేయడం రాజకీయ డ్రామాగా మంత్రి విమర్శించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని సుప్రీంకోర్టు చెప్పినట్లు చెబుతున్నారని, కాని 10 శాతం ఈబీసీతో 50 శాతం రిజర్వేషన్లు దాటినందున ఆ నిబంధనకు కాలం చెల్లిందన్నారు. రాజ్యాంగాన్ని వందలసార్లు సవరించుకున్నామని, ఇప్పుడు బీసీల 42 శాతం రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, అందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని మంత్రి కోరారు. అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని, దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యలయినట్లు బీసీ రిజర్వేషన్‌లో భాగస్వాములు కావాలన్నారు. సర్వేలో పాల్గొనని వారికి బీసీ రిజర్వేషన్లపై విమర్శించే హక్కు లేదన్నారు. బలహీనవర్గాలకు న్యాయం జరగాలని ఉంటే కేటీఆర్ ఢిల్లీకి రావాలని, బీఆర్‌ఎస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల సాధనరే ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటై బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోకాలడ్డితే రాబోయే కాలంలో కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు బిల్లును అమలు చేసి తీరుతామన్నారు. బలహీనవర్గాలకు న్యాయం జరిగేందుకు అవసరమైన రాజ్యాగం సవరణలు చేస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్, సిరాజ్ హుస్సేన్, ఎండీ తాజ్, పడాల రాహుల్, అనిల్ పాల్గొన్నారు.