Share News

కార్పొరేషన్‌లో లెస్‌ టెండర్లు

ABN , Publish Date - May 24 , 2025 | 12:35 AM

రామగుండం నగర పాలక సంస్థకు లెస్‌ టెండర్లు ఇప్పుడు తలనొప్పిగా మారాయి. కాంట్రాక్టర్ల చర్యలు కార్పొరేషన్‌ను అభాసు పాలు చేస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా లెస్‌ టెండర్లు దాఖలు చేస్తున్నారు.

కార్పొరేషన్‌లో లెస్‌ టెండర్లు

- అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల్లో 41శాతం, రోడ్డు నిర్మాణాల్లో 34శాతం

- కొనుగోళ్ల టెండర్లలోనూ అదే తంతు...

- అనుకూలమైన ఇంజనీర్ల జోన్లలో దందా

- అంచనాల్లో ఒకరేటు.. బిల్లు రికార్డులో మరోరేటు...

- పనుల్లో నాణ్యత లేక అవస్థలు...

కోల్‌సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగర పాలక సంస్థకు లెస్‌ టెండర్లు ఇప్పుడు తలనొప్పిగా మారాయి. కాంట్రాక్టర్ల చర్యలు కార్పొరేషన్‌ను అభాసు పాలు చేస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా లెస్‌ టెండర్లు దాఖలు చేస్తున్నారు. సాధారణంగా అంచనాలపై 5 నుంచి 10శాతం తక్కువ రేట్లపై టెండర్లు దాఖలు అవుతాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల్లో 30 నుంచి 41శాతం వరకు, రోడ్ల నిర్మాణాల్లో 15 నుంచి 34శాతం వరకు తక్కువ రేటుపై కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తున్నారు. చివరికి కొనుగోళ్ల టెండర్లలోనూ అదే తంతు కొనసాగుతుంది. ఇటీవల రామగుండం నగరపాలక సంస్థలో ఈ తరహా 30 పనుల్లో భారీగా లెస్‌ టెండర్లు దాఖలయ్యాయి. సుమారు రూ.5కోట్ల పనుల్లో ఈ తరహా టెండర్లు దాఖలయ్యాయంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.

అనుకూలమైన జోన్లలోనే లెస్‌ టెండర్లు

నగరపాలక సంస్థలో తమకు అనుకూలమైన జోన్లలోనే కాంట్రాక్టర్లు భారీగా లెస్‌ టెండర్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా జోన్‌లలో ఇంజనీర్లను బట్టి ఈ తరహా టెండర్లు దాఖలవుతున్నాయనే ప్రచారం ఉంది. అంచనాల సమయంలోనే ఆయా జోన్‌లలో అనుకూలమైన ఐటంలను అంచనాల్లో చేర్చడం, అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్లు లెస్‌ టెండర్లు దాఖలు చేయడం పరిపాటి అయ్యిందనే ఆరోపణలు వస్తున్నాయి. పనులు అసంపూర్తిగా మిగిలిపోతుండగా కాంట్రాక్టర్లకు మాత్రం లెస్‌ టెండర్లలోను రికార్డుల్లో సర్దుబాటు జరుగుతుండడం కార్పొరేషన్‌లో బహిరంగ రహస్యమైంది.

డీవియేషన్‌లోనే గుట్టు...

లెస్‌ టెండర్లు దాఖలయ్యేందుకు డివియేషన్లు, సప్లిమెంటరీ ఐటంలు చేర్చడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంచనాల సమయంలో ఇంజనీర్లు సైట్‌ కండీషన్లు చూడకుండానే అంచనాలు రూపొందించడం, పనుల సమయంలో డివియేషన్లు చేర్చడం పరిపాటి అయ్యింది. 5శాతం డివియేషన్లకు అవకాశం ఉంటుంది. నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్‌ విభాగంలో నానా రకాల విధానాలలో ఈ డివియేషన్లు 25 నుంచి 30శాతానికి చేరుకున్నాయి. సప్లిమెంటరీ అగ్రిమెంట్లలో గూడుపుటాని జరుగుతుంది. టెండర్‌ షెడ్యూల్‌లో ఐటంలకు ఒక రేటు ఉంటే రికార్డు సమయంలో రేట్లు మారుతున్నాయి. కొత్త రేట్లను రికార్డుల్లో చేర్చుతున్నారు. దీంతో డివియేషన్లు, సప్లిమెంటరీ ఐటం అగ్రిమెంట్ల పేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా బిల్లులు రికార్డు అవుతుండడంతో కాంట్రాక్టర్లు భారీగా లెస్‌ టెండర్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా లాభసాటి ఐటంలు ఉన్న పనులు చేయడం, నష్టమయ్యే పనులను వదిలిపెడుతున్నారు. సీసీ రోడ్ల నిర్మాణాల్లో పీసీసీ వేసి సీసీ వేయకుండానే నిధులు అయిపోయాయంటూ పనులు నిలిపివేస్తున్నారు. అధికారులు కూడా అదే విధంగా రికార్డులు చేస్తున్నారు.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల్లో నాణ్యతకు తిలోదకాలు...

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. కార్పొరేషన్‌ సర్టిఫై చేసిన ఐఎస్‌ఐ పరిశ్రమలే కాకుండా ఇతర పరిశ్రమల్లోని నాసిరకం పైపులు తీసుకువచ్చి డ్రైనేజీ నిర్మాణాలు చేస్తున్నారు. ధర తక్కువ ఉన్న పైపులకు నాణ్యత లేకపోవడంతో కొన్ని రోజులకే పైపులు పగిలిపోతున్నాయి. చాంబర్ల నిర్మాణాల్లోనూ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి మళ్లీ పనులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

సగం రేట్లపై పనులెలా...

లెస్‌ టెండర్లు ఇష్టానుసారంగా దాఖలవుతున్నా యంత్రాంగం నోరు మెదపడం లేదు. సాధారణంగా లెస్‌ టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు పనులను పెండింగ్‌లో పెట్టడం, ఏడాది రెండేళ్లకు నామమాత్రంగా పనులు చేసి రికార్డు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 40శాతం తక్కువ రేట్లపై దాఖలవుతున్న టెండర్లలో పనులెలా సాగుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బిల్లుల రికార్డుల్లో ఎఫ్‌ఎస్‌డీలు, లేబర్‌సెస్‌, సీనరేజ్‌, డీఎంఎఫ్‌టీ, ఎస్‌ఎంఎఫ్‌టీ, ఐటీ, గ్రీన్‌ఫండ్‌, న్యాక్‌, పర్మిట్‌ ఫీజు తదితర మినహాయింపులు ఉంటాయి. సగం కన్నా తక్కువ రేట్లపై పనులు చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

కఠినంగా వ్యవహరిస్తేనే ప్రజలకు ప్రయోజనం...

నిబంధనల ప్రకారం లెస్‌ టెండర్లు దాఖలు చేసిన వారి నుంచి వెంటనే అడ్వాన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. టెండర్‌ అంచనాలపై 25శాతం దాటితే మిగిలిన మొత్తాన్ని ఏఎస్‌డీగా జమ చేయించుకోవాల్సి ఉంటుంది. వెంటనే కాంట్రాక్టర్లతో పనులు మొదలు పెట్టించడం, టెండర్‌ ప్రకారం నాణ్యతతో పనులు చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిల్లుల రికార్డు సమయంలో ఇంజనీరింగ్‌ విభాగం నిబంధనల ప్రకారం పని చేస్తే సమస్య ఉండదు. సాధారణంగా బిల్లును సిఫార్సు చేసే సమయంలో కమిషనర్‌ పనిని పరిశీలించాల్సి ఉంటుంది. కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించకుండానే సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - May 24 , 2025 | 12:35 AM