Share News

‘ లక్ష’ణంగా వదిలేశారు..

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:24 AM

నగరవాసులకు తాజా కూరగాయలను అందించడంతోపాటు రైతులు, వ్యాపారులకు కూడా మేలు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు (కూరగాయల మార్కెట్లు) నిరుపయోగంగా మారాయి.

‘ లక్ష’ణంగా వదిలేశారు..

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): నగరవాసులకు తాజా కూరగాయలను అందించడంతోపాటు రైతులు, వ్యాపారులకు కూడా మేలు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు (కూరగాయల మార్కెట్లు) నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు టవర్‌సర్కిల్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్‌, ముకరంపుర, పాతబజారులో మాత్రమే కూరగాయల మార్కెట్లు ఉండేవి. నగర విస్తీర్ణం పెరుగుతూ కొత్తగా కాలనీలు ఏర్పాడ్డాయి.

ఆదరణకు నోచుకోని రైతు బజారు

వీక్లీ బజారులో ఆధునిక హంగులతో విశాలమైన స్థలంలో రైతు బజారును ఏర్పాటు చేశారు. అక్కడే హోల్‌సేల్‌, రిటేల్‌ కూరగాయల అమ్మకాలతోపాటు మాంసం, చేపల విక్రయాలు కూడా చేసేందుకు ప్లాట్‌ఫామ్స్‌, షెడ్స్‌ నిర్మించారు. టవర్‌సర్కిల్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను అక్కడికి తరలించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వ్యాపారులు, రైతులు ఆసక్తి చూపలేదు. ప్రధాన కూరగాయల మార్కెట్‌తోపాటు పరిసరాల రోడ్లలో, అటు రైతుబజారు ముందు భాగంలోనే కూరగాయలు అమ్ముతున్నారు. రైతుబజారులో మాంసం, చేపల మార్కెట్‌ ఆదరణ నోచుకోలేదు. దీనితో అక్కడ చాలా షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. కాశ్మీరుగడ్డ రైతు బజారును ఏర్పాటు చేసి ముకరంపుర మార్కెట్‌ను అక్కడికి తరలించగా ప్రస్తుతం మార్కెట్‌ను కూల్చివేసి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించడంతో అక్కడ కూడా రోడ్లపైనే అమ్మకాలు చేస్తున్నారు.

కనీస నిర్వహణ కరువు

రాంనగర్‌, ఇందిరానగర్‌, చైతన్యపురి, సప్తగిరికాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీల్లో రైతుబజార్ల (మార్కెట్ల)ను ఏర్పాటు చేసి షెడ్లు, ఫ్లాట్‌ ఫామ్‌లు నిర్మించారు. రాంనగర్‌ మార్కెట్‌ మినహా ఇందిరానగర్‌, చైతన్యపురి, హౌసింగ్‌బోర్డు, సప్తగిరికాలనీల్లోని మార్కెట్ల నిర్వహణ పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలైన మంచినీటి వసతి, మరుగుదొడ్ల వంటి కనీసవసతులు సరిగా లేకపోవడంతో రైతులు, వ్యాపారులు అమ్మకాలు సాగించేందుకు ముందుకు రాలేదు. మార్కెట్‌పై విస్తృత ప్రచారం నిర్వహించక పోవడం, మార్కెట్లకు సమీపంలో రోడ్లపై అమ్మకాలు జరుగకుండా చర్యలు తీసుకోక పోవడం వంటి కారణాలతో మార్కెట్లన్ని నిరుపయోగంగా మారాయి. అపరిశుభ్రవాతావరణంలో అసాంఘిక కార్యక్రమాలకు, వాహనాలను నిలిపే అడ్డాలుగా మారాయి. ఎంతో ఆర్భాటంగా మార్కెట్లను ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మార్కెట్ల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. లక్షలు వెచ్చించి నిర్మించిన మార్కెట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుంది. రోడ్డుపై కూరగాయల అమ్మకాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందించి మార్కెట్లపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 01:24 AM