Share News

ఎల్‌ఎండీ రక్షణకు ‘లేక్‌’ పోలీస్‌

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:10 AM

ఇటీవల పొరుగు జిల్లాకు చెందిన ఒక వివాహిత మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చింది.

ఎల్‌ఎండీ రక్షణకు ‘లేక్‌’ పోలీస్‌

- డ్యాం కట్టపై 24 గంటల పోలీసుల గస్తీ

- ఆత్మహత్యలకు అడ్డుకట్ట

- ఇప్పటి వరకు 292 మందిని రక్షించి కౌన్సెలింగ్‌

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పొరుగు జిల్లాకు చెందిన ఒక వివాహిత మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చింది. అక్కడే గస్తీలో ఉన్న లేక్‌ పోలీసులు గమనించి ఆమెను రక్షించారు. కుటుంబంలో భూ వివాదంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడాలని డ్యాంలోకి దూకే సమయంలో లేక్‌ పోలీసులు కాపాడారు. కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

- కొంత కాలం క్రితం కరీంనగర్‌కు చెందిన ఒక వృద్ధురాలు తన కొడుకులు తన పోషణను పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా లేక్‌ పోలీసులు రక్షించి కొడుకులను పిలిపించి అప్పగించారు.

- మరొక ఘటనలో భర్త కుటుంబ పోషణను చూసుకోకుండా నిత్యం మద్యం సేవిస్తూ వేధిస్తున్నాడని ఒక మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు రక్షించారు. ఇలా రకరకాల సమస్యలతో కలత చెంది చావే శరణ్యమంటూ జలాశయంలో ఆత్మహత్యకు యత్నించిన వారిని లేక్‌ పోలీసులు కాపాడుతున్నారు.

ఫ అదుపులోకి వచ్చిన నేరాలు

మానేరు జలాశయంలో కొందరు సరదాగా ఈత, స్నానాలకు వెళ్లి తరచుగా మృత్యువాత పడడంతో కరీంనగర్‌కు ఈ జలాశయం శాపంగా మారిందని గతంలో భావించేవారు. కొంతకాలం క్రితం సరదాగా మానేరు జలాశయం నీటిలోకి దిగిన ఆరుగురు బాలురు ఒక గుంతలోని నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన తరువాత అప్పటి పోలీసు కమిషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో 2017 అక్టోబరు 10న మానేరు జలాశయం వద్ద లేక్‌ పోలీసు వ్యవస్థను తీసుకువచ్చారు. మానేరుడ్యాం కట్ట వద్ద లేక్‌ అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి 24 గంటలపాటు గస్తీని ఏర్పాటు చేశారు. ఉజ్వల పార్క్‌, డీర్‌ పార్క్‌, మానేరు జలాశయం ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చూసేందుకు లేక్‌ అవుట్‌పోస్ట్‌కు ఒక డ్రోన్‌ కెమెరా, బైనాక్యులర్లు, సిబ్బందికి సైకిళ్లు, వాకీటాకీలు, ఇతర అవసరమైన పరికరాలు, వస్తువులు అందించారు. లేక్‌ అవుట్‌పోస్ట్‌ ఏర్పాటుకు ముందు మానేరు జలాశయంలోనే చాలా మంది బహిర్భూమికి వెళుతుండేవారు. ఇటువంటి వారికి కట్టడి చేసేందుకు లేక్‌ పోలీసులు డ్రోన్‌ కెమెరా ద్వారా గుర్తించి వారి మెడలో పూలదండలు వేసి కౌన్సెలింగ్‌ ఇవ్వటంతో పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. కరీంనగర్‌, వరంగల్‌, సిద్ధిపేట జిల్లా ప్రజల తాగునీటికి ఉపయోగిస్తున్న మానేరు జలాశయంలో రజకులు, ఇతరులు బట్టలు శుభ్రపరిచేవారు. వీరందరికి లేక్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో వీరు మానుకున్నారు. లేక్‌ అవుట్‌పోస్ట్‌ పోలీసులు మానేరు జలాశయంతోపాటు ఉజ్వల పార్క్‌, డీర్‌ పార్క్‌, బైపాస్‌ రోడ్‌లో నిత్యం గస్తీ తిరుగుతుండడంతో ఈ ప్రాంతంలో గతంలో జరిగిన దొంగతనాలకు చెక్‌ పెట్టినట్లయింది. డ్యాం, పార్క్‌లకు వచ్చే యువజంటలు, ప్రేమికులను కొందరు అకతాయిలు వేధింపులకు గురి చేయటం, మరికొందరు దొంగలు వారిని బెదిరించి డబ్బులు, బంగారం వంటివి దోచుకునేవారు. ఇటువంటి నేరాలు నియంత్రణలోకి వచ్చాయి.

ఫ 2017లో ఏర్పాటు

2017 అక్టోబరు 10న లేక్‌ అవుట్‌పోస్ట్‌ ఏర్పాటుకాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 292 మందిని ఆత్మహత్యల నుంచి లేక్‌ పోలీసులు రక్షించి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జలాశయంలో ఆత్మహత్యలు చేసుకునేందుకు వచ్చేవారిని రక్షించడం, ఆ ప్రాంతంలో దొంగతనాలు, బహిరంగ మద్యం, పోకిరీలను అరికట్టి, భద్రతను పెంచి ప్రజల్లో విశ్వాసం పెంపొందించారు. 24 గంటలపాటు గస్తీ ఉండటంతో నేరాలు పూర్తిగా నియంత్రణలోకి రావటంతో సందర్శకులు, వాకర్స్‌ స్వేచ్ఛగా వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వేకువజామున నాలుగు గంటలకు వాకింగ్‌కు వస్తున్నారు. ప్రస్తుతం లేక్‌ అవుట్‌పోస్ట్‌లో ఎస్‌ఐతో సహా ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఫ లేక్‌ అవుట్‌పోస్ట్‌లో సిబ్బందిని పెంచాలి....

- గునుకుల సత్యనారాయణరెడ్డి, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌

డ్యాం కట్టపై 24 గంటల గస్తీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో గస్తీ మరింత పకడ్బందీగా చేపట్టేందుకు అవుట్‌పోస్టులో సిబ్బందిని మరింత పెంచాలి. మానేరు జాలాశయం కట్ట ఐదు కిలోమీటర్ల మేర వరకు విస్తరించి ఉండటంతో గస్తీ నిర్వహణ ప్రస్తుత సిబ్బందితో కొంత కష్టంగానే మారింది. సిబ్బంది రెట్టింపు పెంచితే మానేరు జలాశయం వద్ద వాకర్స్‌, సందర్శకులకు భద్రత పెరుగుతుంది. ప్రస్తుతం లోయర్‌ మానేరుడ్యాం పూర్తి నీటితో నిండి ఉండటం కారణంగా సందర్శకుల తాకిడి అధికమైంది. వేలాంది మంది నిత్యం డ్యాంను సందర్శిస్తున్నారు. వేకువజామున 3 గంటల నుంచే మహిళలు వాకింగ్‌ చేస్తున్న కారణంగా మరింత భద్రతను పెంచాలని పోలీస్‌ కమిషనర్‌ను కోరుతున్నాం.

ఫ డ్యాం నీటిలోకి ఎవరూ దిగవద్దు

- బుద్దర్తి రమేష్‌, లేక్‌ అవుట్‌పోస్ట్‌ ఆర్‌ఎస్‌ఐ

డ్యాం నీటిలోకి మత్స్యకారులు మినహా ఎవరూ దిగేందుకు అనుమతిలేదు. 24 గంటలపాటు గస్తీతో ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకుంటున్నాం. చాలా మంది అకతాయిలను పట్టుకుని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ట్రిపుల్‌ రైడింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌లను గుర్తించి జరిమానాలు విధిస్తున్నాం. మానేరు జలాశయంలో ఆత్మహత్యలు చేసుకునేందుకు వచ్చేవారిని కాపాడుతున్నాం. లేక్‌ అవుట్‌పోస్ట్‌ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు 292 మంది ప్రాణాలు కాపాడాం.

Updated Date - Sep 09 , 2025 | 01:10 AM