సర్వేయర్ల ఎంపికకు కసరత్తు
ABN , Publish Date - May 22 , 2025 | 01:56 AM
జిల్లాలో ప్రైవేట్ లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ధరణి చట్టాన్ని సవరించి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకవస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనున్నది. భూముల రిజిస్ట్రేషన్లకు అధీకృత మ్యాప్ జత చేయాలని చట్టంలో మార్పులు చేయడంతో సర్వేయర్లకు డిమాండ్ పెరగనున్నది. ప్రభుత్వ పరంగా తక్కువ మంది మాత్రమే సర్వేయర్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది.
- ఈ నెల 26 నుంచి మూడు నెలల శిక్షణ
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ప్రైవేట్ లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ధరణి చట్టాన్ని సవరించి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకవస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనున్నది. భూముల రిజిస్ట్రేషన్లకు అధీకృత మ్యాప్ జత చేయాలని చట్టంలో మార్పులు చేయడంతో సర్వేయర్లకు డిమాండ్ పెరగనున్నది. ప్రభుత్వ పరంగా తక్కువ మంది మాత్రమే సర్వేయర్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అన్ని జిల్లాల నుంచి సర్వే అండ్ ల్యాండ్స్ అధికారులు పాలిటెక్నిక్, ఐటీఐ సివిల్, బీటెక్ చేసిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా 224 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హతలు ఉన్న వారికి అధికారులు ఎంపిక చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి భూములు ఎలా సర్వే చేయాలి, ఎలాంటి పరికరాలను వినియోగించాలి, ఏఏ రికార్డులను అనుసరించి సర్వే చేయాలనే విషయమై పదవీ విరమణ పొందిన సర్వేయర్లతో 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత నెల రోజుల పాటు ప్రస్తుతం పని చేస్తున్న రెగ్యులర్ సర్వేయర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. అనంతరం వారికి లైసెన్సులు జారీ చేయనున్నారు. వీరి సేవలను ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లకు, ఇతరత్రా భూముల సర్వేకు సద్వినియోగం చేసుకోనున్నారు. సర్వే కోసం వసూలు చేసే ఫీజుల నుంచి కమిషన్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ విధానం కర్నాటక రాష్ట్రంలో అమలవుతున్నది.
సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ర్టేషన్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఎటువంటి మ్యాన్యువల్ రికార్డులు లేకుండా స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. ధరణిలో చోటు చేసుకున్న పొరపాట్ల సవరణ కోసం బాధిత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భూ రికార్డులకు భద్రత లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుక వచ్చింది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో భూముల రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు మ్యాన్యువల్ రికార్డులను భద్రపరచం, సాదాబైనామాల ద్వారా భూముల క్రమబద్ధీకరణ, తదితర అంశాల్లో అనేక మార్పులు తీసుక వచ్చారు. భూముల రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ భూమిని సర్వే చేయించి ఆధీకృత మ్యాప్‌ను జత చే,యాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే లైసెన్స్‌డ్ సర్వేయర్ ద్వారా సర్వే చేయిస్తారు. దానిని రెగ్యులర్ సర్వేయర్ ధ్రువీకరించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో క్షేత్ర స్థాయిలో రెగ్యులర్ సర్వేయర్లు ఎనమిది మంది ఉండగా, ఒకరు జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రైవేట్ లైసెన్స్‌డ్ సర్వేయర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియమాకాలతో భూముల సర్వేకు ఇక నుంచి భూ పట్టాదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన కష్టాలు తప్పనున్నాయి.