కిక్కు ‘లక్కు’ ఎవరికో..?
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:53 AM
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈనెల 27న నిర్వహించే డ్రాలో కిక్కు లక్కు ఎవరికి దొరుకుతుంది..? ఎవరికి నిరాశ మిగులుతుంది..? అనే ఉత్కంఠ మొదలైంది.
- దరఖాస్తులు తగ్గినా ఖజానా గలగల..
- జిల్లాలో 1,381 దరఖాస్తుల ద్వారా ఆదాయం రూ.41.43 కోట్లు
- 2023-25లో 2,036 దరఖాస్తులు.. రూ.40.72 కోట్ల ఆదాయం
- రూ.3 లక్షల దరఖాస్తు ఫీజుతో సిండికేట్‌గా మారిన ఆశావహులు
- సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట వైన్స్‌లకుఅధిక దరఖాస్తులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈనెల 27న నిర్వహించే డ్రాలో కిక్కు లక్కు ఎవరికి దొరుకుతుంది..? ఎవరికి నిరాశ మిగులుతుంది..? అనే ఉత్కంఠ మొదలైంది. మద్యం దుకాణాల టెండర్ల నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 18న గడువు ముగిసిన అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. బీసీ జేఏసీ బందు, బ్యాంక్ సెలవుల వంటి కారణాలతో దరఖాస్తుల గడువును 23వ తేదీ వరకు పొడిగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దరఖాస్తులు గత లైసెన్స్ పీరియడ్ కంటే తక్కువ వచినా పెరిగిన లైసెన్స్ ఫీజుతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం మాత్రం సమకూరింది.
ఫ పెరిగిన ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేశారు. గడువు పెంచిన గతంలో కంటే దరఖాస్తులు తగ్గిన ఈసారి ప్రభుత్వం దరఖాస్తు ఫీజు రూ.3లక్షలు చేయడంతో ఆదాయం మాత్రం పెరిగింది. 2023-25 సంవత్సరానికి సంబంధించిన లైసెన్స్ కోసం2031 దరఖాస్తుల ద్వారా రూ.40.72 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 2025-27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 1381 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా రూ 41.43 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో 1381 మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలటీలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్లలో 598 దరఖాస్తులు రాగా, వేములవాడలో 354, ఎల్లారెడ్డిపేటలో 354 దరఖాస్తులు వచ్చాయి. జనరల్ కేటగిరిలోని 11వ నంబర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు సమర్పించారు.
ఫ 27న డ్రా కోసం ఏర్పాట్లు..
ప్రభుత్వం ఈసారి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు తర్వాత కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా టెండర్ దరఖాస్తుల ఫీజు రూ.లక్ష పెంచింది. సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో ఆశావహులు పెరిగిన దరఖాస్తు ఫీజులు దృష్టిలో పెట్టుకొని సిండికేట్‌గా మారి దరఖాస్తులను సమర్పించారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కావడంతో మొదట్లో దరఖాస్తులు కూడా తక్కువ రావడంతో ఎక్సైజ్ అధికారులు టెండర్లు వేసే విధంగా విస్తృతంగా ప్రచారం చేశారు. వాట్సాప్‌లో మెస్సెజ్, బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తూ దరఖాస్తులను పెంచే విధంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ గత లైసెన్స్ పీరియడ్‌కంటే 655 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి జిల్లాలో డిమాండ్ ఉన్న షాపులకు అధికంగా దరఖాస్తులను సమర్పించారు.