కార్తీక మాసం... హరిహర ప్రియం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:59 AM
మాసానాం కార్తీకం ఉత్తమం.. మాఘమాసం.. శివప్రీతి కరం, ధనుర్మాసం.. వైష్ణవ ప్రీతికరం... కానీ ఈ కార్తీకమాసం శివకేశవ ప్రీతికరం... అందుకే పవిత్రమైన మాసంగా భావిస్తారు. కార్తీక మాసం దైవ సంబంధికమైన వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు, శుభ కార్యాలకు ఎంతో ముఖ్యమైనది. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో దీపారాధన ప్రత్యేకంగా కనిపిస్తుంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మాసానాం కార్తీకం ఉత్తమం.. మాఘమాసం.. శివప్రీతి కరం, ధనుర్మాసం.. వైష్ణవ ప్రీతికరం... కానీ ఈ కార్తీకమాసం శివకేశవ ప్రీతికరం... అందుకే పవిత్రమైన మాసంగా భావిస్తారు. కార్తీక మాసం దైవ సంబంధికమైన వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు, శుభ కార్యాలకు ఎంతో ముఖ్యమైనది. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో దీపారాధన ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయా మాసాల్లో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్రికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. ఈ మాసంలో కృత్రిక నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ మాసం ప్రారంభం నుంచి సూర్యోదయానికి పూర్వమేలేచి నది స్నానం ఆచరించి పొడి బట్టలతో దీపారాధన చేస్తారు. మహిళలు వ్రతాలు, నోములను ఆచరిస్తారు. ఈ మాసంలో యోగ సాధన కూడా ఎంతో అనువైనదిగా చెప్పుకుంటారు. మే, జూన్‌లో ఉండే అధిక ఎండలు కానీ, డిసెంబర్, జనవరిలో ఉండే అధిక చలి కానీ ఈ మాసంలో ఉండవు. వాతావరణం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అందుకే ఉదయం లేచి నది స్నానాలు చేయడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందని, మనస్సు ఆహ్లాదంగా ఉంటుందని భావిస్తారు. కార్తీక మాసంలో బ్రహ్మణుడికి దీపం దానం చేస్తే ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని.. తులసీ, మారేడు, ఉసిరి కాయలతో శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించిన వారికి శుభాలు కలుగుతాయని భావిస్తారు. తులసీ సన్నిధిలో దేవాలయంలో దీపం వెలిగించే వారికి ఐశ్యర్య సిద్ధి కలగడమే కాకుండా ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు పోతాయని భావిస్తారు. ఉసిరికాయపై దీపాలు పెట్టి వెలిగించడం శుభాలనిస్తుంది. కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పున్నమి వరకు మహిళలు భీష్మపంచక వ్రతం చేస్తారు. ఈ ఐదు రోజులు శివమంత్రం, విష్ణుమంత్రం, ఉపదేశం పొందండం ఎంతో ఫలితాన్ని ఇస్తుందని భావిస్తారు. అంతేకాకుండా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం, ఆవునేతి దీపం వెలిగించడం, పరశివునికి ఇష్టమైన అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వాచర్చన చేస్తే సకల పాపాలు పోతాయని భావిస్తారు. మహిళలు దీపాతోరణాలతో ప్రత్యేక పూజలతో మంగళవారం కార్తీక మాసం ప్రారంభమైంది.
మహిళల దీపారాధన
దేవుని ముందు దీపం వెలిగించడంలో పూర్వికులు నూనెను కర్మఫలంగాను, వత్తిని శరీరంగాను, జ్వాలను ప్రాణంగా భావిస్తారు. కర్మఫలం అనే నూనె ఉన్నంత వరకే వత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుందని భావిస్తారు. కర్మఫలం పూర్తి అవగానే ప్రాణం శరీరాన్ని వదిలిపెడుతుందని చెబుతారు. సూర్యోదాయానికి పూర్వమే లేచి నది స్నానం చేసి పొడి బట్టలతో దీపారాధన చేయడం మంచిదని భావిస్తారు. ఈ మాసంలో జ్వాల తోరణాలతో వెలుగులు నింపుతాయి. ప్రతి దేవాలయాన్ని దీపాలతో మహిళలు అలంకరించడంతో శోభాయమానంగా కనిపిస్తాయి. అంతేకాకుండా మహిళలు నదులలో దీపాన్ని దానంగా ఇస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపుతాయని భావిస్తారు.
ఆచరించాల్సిన నియమాలు
కార్తీక మాసంలో కొన్ని నియామాలు పాటించడం ఎంతో ముఖ్యం. స్నానం చేసిన తరువాత దేవుని పూజకు ఉపయోగించే ఆసనం(పీఠ) వేరే పనికి ఉపయోగించరాదు. దేవుని పూజలు చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. బూడిద గుమ్మడి కాయ మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టాలి. దీని ద్వారా దృష్టి దోషాలు పోతాయి. మట్టి, ఇత్తడి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఉసిరి కాయ దీపం వల్ల పాపాల నివారణ, పుష్పదీపం వల్ల జ్ఞానం ప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి మహా కార్తికి స్నానం పుణ్యప్రదం అరుణోదయ వేళ శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ గడపాలి. దీపారాధన చేస్తే ఎంతో భవిష్యత్ ఉంటుంది. శ్రీ మహాగణపతికి వెలిగిస్తే అన్ని కార్యాలు సిద్దిస్తాయని, సర్వతికి జ్ఞాపకశక్తి, అజ్ఞానం తొలగుతుంది. మహాలక్ష్మి దేవికి వెలిగిస్తే ఐశ్యర్యం వస్తుంది. దుర్గాదేవికి వెలిగిస్తే కష్టాలు తొలగుతాయి. గంగాదేవికి వెలిగిస్తే సంతోషం ఉంటుంది. రామదేవునికి వెలిగిస్తే అన్నదమ్ముల మధ్య సంఖ్యత ఉంటుంది. తులసీ దేవునికి వెలిగిస్తే సర్వపాపాలు నివారణ లభిస్తాయి. శివపార్వతికి వెలిగిస్తే ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు కలిగిస్తాయి. లక్ష్మీనారాయణనుడికి వెలిగిస్తే జీవన్ముక్తి కలుగుతుంది. నవగ్రహ దేవతలకు వెలిగిస్తే పేదరికం తొలగి ఆరోగ్యం, తేజోవంతం కలుగుతాయి.
బొమ్మల కొలువులు
కార్తీక శుక్ల పక్షం మొదటి రోజున మహిళలు బొమ్మల కొలువుతోపాటు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. శ్రీకృష్ణ భగవానుడిని బొమ్మగా తయారుచేసి నీరు, పూలు, పెరుగు, కుంకుమ, బియ్యం, మిఠాయిలో నైవేద్యం సమర్పిస్తారు. స్వామి ఆరాధణ శ్లోకాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శుక్ల పక్షం రెండో రోజున భగిని అస్త భోజనం అనే పండుగను సోదరుల సంక్షేమం కోసం సోదరిమణులు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. పరమేశ్వరుడి ఆలయ ప్రాంగణంలో పుట్టలో పాలు పోసి పూజిస్తారు. ఈ మాసమంతా ఆధ్యాత్మిక ఆనందం ఆరోగ్యం, సంతోషాలతో విందు భోజనాలతో శుభాకార్యాలతో ఆనందగా గడుపుతారు.
ప్రత్యేక పూజలు
కార్తీక మాసంలో నోములు, వ్రతాలతోపాటు కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. కార్తీక శుక్లపక్షం మొదటి రోజున గోవర్ధన పూజ నిర్వహిస్తారు. రెండో రోజున భగిని హస్తభోజనం అనే పండుగ సోదరుల సంక్షేమం కోసం సోదరిమణులు నిర్వహిస్తారు. శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండుగను నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. దీంతోపాటు దేవోత్థాని ఏకాదశి పండుగ, వన భోజనాలు, కార్తీక పూర్ణిమ రోజున తులసి పూజలు నిర్వహిస్తారు. అలాగే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు వద్ద విష్ణు పూజలు చేస్తారు. దివ్వ క్షేత్రాల్లో విష్ణువుకు పూజ చేసినంత ఫలితం లభిస్తుందని భావిస్తారు.
వన భోజనాలు
కార్తీక మాసంలో వన భోజనాలకు ప్రత్యేకత ఉంది. రావి, ఉసిరి, మామిడి, మారేడు వంటి చెట్ల కింద సామూహిక వన భోజనాలు చేస్తారు. ఆధునిక కాలంలో కూడా ప్రకృతితో ఉన్న అనుబంధం వన భోజనాలతో కనిపిస్తుంది.