Share News

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు త్వరలో మోక్షం

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:24 AM

జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు ప్రయాణించేందుకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు త్వరలో మోక్షం
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వినతిపత్రం అందజేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

- ప్రారంభం కానున్న విస్తరణ పనులు

- హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు ప్రయాణించేందుకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రస్తుతమున్న డబుల్‌ రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుంది. ప్రభుత్వం దీనిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించింది. కేంద్రం ఇందుకు నిధులు కేటాయించింది. రోడ్డుకు ఇరువైపులా మండల కేంద్రాలు ఉండడం, రోడ్డు పక్కనే గ్రామాలు వెలిసి వ్యాపార కేంద్రాలుగా మారడంతో విలువైన ఆ స్థలాలను వదులుకోవడానికి ప్రజలు అంగీకరీంచలేదు. దీంతో రోడ్డు విస్తరణ పెండింగ్‌లో పడుతూ వస్తున్నది. చివరకు ప్రభుత్వం దీనిని గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డుగా మార్చి పెద్ద గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పొలాల మీదుగా రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చింది. అక్కడక్కడ ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు బైపాస్‌లను ప్రతిపాదించింది. అయినా ఆ రోడ్డు విస్తరణ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు త్వరలో తొలగిపోనున్నట్లు తెలుస్తున్నది.

ఫ తొలగిన అడ్డంకులు

కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్‌-జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు కేంద్రం ఇదివరకే 2,151.35 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. అందుకు నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. టెండర్‌ దశలో ఉన్న సమయంలో ప్రజలనుంచి పలు అభ్యంతరాలు రావడం, న్యాయపరమైన ఇబ్బందులు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయని తెలుస్తున్నది. బండి సంజయ్‌కుమార్‌ నితిన్‌ గడ్కరీని కలిసి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించడంతోపాటు అధికారులను పిలిచి ఎందుకు పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ అడిగారు. ఇందుకు ఉన్న సమస్యలన్నింటిని మంత్రికి వివరించి వాటన్నింటిని అధిగమించామని అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి విస్తరణ పనులను ప్రారంభిస్తామని అధికారులు కేంద్ర మంత్రికి వివరించడంతో కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు పట్టిన గ్రహణం వీడిపోనున్నది.

ఫ సీఆర్‌ఐఎఫ్‌ నిధుల విడుదలకు వినతి...

జిల్లాలో పలు రోడ్ల విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నందున వీటిని చేపట్టేందుకు సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) నుండి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. 113 కోట్ల అంచనాలతో కూడిన పనుల ప్రతిపాదనలను ఆయన గడ్కరీకి సమర్పించారు. కొత్తపల్లి మండలం బావుపేట-ఖాజీపూర్‌ రోడ్డులో మానేరు నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం, గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి-పొత్తూరు రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. చందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు వంతెనల నిర్మాణ పనులు, కిష్టంపల్లి రోడ్డు వంతెన పనులు, శంకరపట్నం మండలం అర్కండ్ల-కన్నాపూర్‌ వరద కాలువపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని బండి సంజయ్‌ కుమార్‌ నితిన్‌ గడ్కరీని కోరారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించి సీఆర్‌ఐఎఫ్‌ నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - Jul 29 , 2025 | 01:24 AM