Share News

Karimnagar: మహిళాసంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయం

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:03 AM

గణేశ్‌నగర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమమే శుక్రవారం సభ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

Karimnagar:  మహిళాసంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయం

- ఆరేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించాలి

- మహిళలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

గణేశ్‌నగర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమమే శుక్రవారం సభ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌లోని దుర్గమ్మగడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని అన్నారు. నూతన సిలబస్‌తో, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీల్లో బోధిస్తున్నామని అన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీల్లో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రత్యేక క్యాంపుల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. మహిళలందరూ సేవలను వినియోగించుకోవాలన్నారు. బీపీ, షుగర్‌ వంటి వ్యాధులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య మహిళ పరీక్ష ద్వారా ప్రమాదకరమైన వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని తెలిపారు. అంగన్వాడి కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ప్రతి నెలా నమోదు చేసి శుక్రవారం సభలో ప్రజలకు వినిపిస్తున్నామని అన్నారు.ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. తానూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జన్మించానని తెలిపారు. శుక్రవారం సభలో అవగాహన ద్వారా జిల్లాలోని మహిళల్లో రక్తహీనతను నివారించగలుగుతున్నామని వెల్లడించారు. అనంతరం దుర్గమ్మ గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీతో మధ్యాహ్నం భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సీడీపీవో సబిత, వైద్యాధికారులు సనా, సూపర్వైజర్‌ రేణుక, ఆర్పీలు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:03 AM