karimnagar : లక్కు ఎవరిదో..
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:58 AM
కరీంనగర్ క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాలకు లైసెన్సీలను సోమవారం ఎంపిక చేయనున్నారు. 94 దుకాణాలకు 2,730 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- నేడు 11 గంటలకు లాటరీద్వారా మద్యం షాపుల లైసెన్సీల ఎంపిక
- కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాట్లు పూర్తి
- ఎంట్రీపాస్ ఉంటేనే ఆడిటోరియంలోకి అనుమతి
- బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు, సెల్‌ఫోన్లకు అనుమతిలేదు
కరీంనగర్ క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాలకు లైసెన్సీలను సోమవారం ఎంపిక చేయనున్నారు. 94 దుకాణాలకు 2,730 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదృష్టం ఎవరిని వరించనుందోనని మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు రెండేళ్లపాటు మద్యం షాపుల నిర్వహణకు సెప్టెంబరు 26న నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు వైన్‌షాపులవారీగా వచ్చిన దరఖాస్తులకు కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఒక దరఖాస్తును లైసెన్స్ హోల్డర్‌గా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే దరఖాస్తుదారులందరికి ఎంట్రీపాస్‌లను జారీ చేశారు. ఎంట్రీ పాస్‌తోపాటు గుర్తింపుకార్డు ఉన్నవారినే ఆడిటోరియంలోకి అనుమతిస్తారు. ఆడిటోరియంలో ఏర్పాట్లను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి శ్రీనివాసరావు, ఎక్సైజ్ సీఐలు ఆదివారం పరిశీలించారు. లాటరీ విధానం ద్వారా ఎంపికైన లైసెన్స్‌దారులు మొదటి వాయిదా ఎక్సైజ్ టాక్స్ (ఆరో వంతుఫీజు)ను చెల్లించేందుకు ఆడిటోరియంలోనే ప్రత్యేకంగా బ్యాంక్ క్యాష్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. నగదుతోపాటు డీడీ, చాలన్ల రూపంలో మొదటి విడత ఎక్సైజ్ టాక్స్ చెల్లించేందుకు సోమ, మంగళవారం వరకు గడువు విధించారు. సెల్‌ఫోన్లను లోపలికి అనుమతించరు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల వరకు ఆడిటోరియం వద్దకు చేరుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూచించారు. మొదట 10 దుకాణాల దరఖాస్తుదారులను ఆడిటోరియంలోకి అనుమతిస్తామని, ఆ షాపుల లాటరీ ప్రక్రియ పూర్తి అయిన తరువాత వైన్‌షాపు గెజిట్ నంబరు ప్రకారం వరుసక్రమంలో ఆయా షాపులకు లైసెన్సీల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. ఆడిటోరియం బయటకు దరఖాస్తుదారులు కూర్చేనేందుకు కుర్చీలు, తాగునీటి వసతులను ఏర్పాటు చేశారు. ఆడిటోరియం వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు ఫైర్ ఇంజన్, అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 94 వైన్‌షాపులకు రికార్డుస్థాయిలో 2,730 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో వైన్‌షాపు లైసెన్స్ కోసం సరాసరిగా 29 మంది వరకు పోటీపడ్డారు. నూతనంగా వైన్‌షాపుల లైసెన్స్‌లు పొందనున్న మద్యం వ్యాపారులు 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30వ తేదీ వరకు రెండేళ్లపాటు షాపులను నిర్వహించుకోవచ్చు.
ఫ దరఖాస్తుల ద్వారా రూ. 81.9 కోట్ల ఆదాయం
జిల్లాలో 94 వైన్‌షాపులకు నోటిఫికేషన్ జారీకాగా 4,040 దరఖాస్తులు రాగా అప్పుడు 2 లక్షల ఫీజు రూపంలో 80 కోట్ల 80 లక్షల రూపాయలు దరఖాస్తుల రూపంలో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 2025-27 సంవత్సర కాలానికి 2,730 దరఖాస్తులు మాత్రమే రావటం గమనార్హం. ఇప్పుడు దరఖాస్తుఫీజు 3 లక్షలకు పెంచడంతో 81.9 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినప్పటికీ ఆదాయం 1.1 కోట్ల రూపాయలు పెరిగింది.
ఫ అత్యధికంగా గెజిట్ నంబర్ 37 షాపుకు దరఖాస్తులు
జిల్లాలోని గంగాధరలోని గెజిట్ నెంబరు 37 షాపు లైసెన్స్ కోసం అత్యధికంగా 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ షాపు లైసెన్స్ ఫీజు (ఎక్సైజ్ టాక్స్) ఏడాదికి 55 లక్షల రూపాయలుకాగా రెండు సంవత్సరాలకు కలిపి 1.1 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ వైన్‌షాపునకు వచ్చిన దరఖాస్తుల రూపంలోనే 1.41 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ఇలా జిల్లాలోని పలు వైన్‌షాపులకు వచ్చిన దరఖాస్తుల రూపంలో ఆదాయం ఆయా వైన్‌షాపుల లైసెన్స్‌ఫీజుకంటే అధికంగా, సమానంగా ఉండడం విశేషం.