karimnagar : ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:17 AM
కరీంనగర్ క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై కరీంనగర్ పోలీసులు దృష్టి సారించారు.
- 21 రోజుల్లో 13,869 కేసులు నమోదు
- 60 శాతం జరిమానాలు ట్రిపుల్ రైడ్‌పైనే....
- రూ. 1.13 కోట్ల జరిమానాలు
కరీంనగర్ క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై కరీంనగర్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీలో భాగంగా నగరమంతటా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో తీసుకునే చర్యల్లో రాజీపడబోమని, ఇందుకు వాహనదారులు, నగర ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు.
ఫ నగరవాప్తంగా 769 సీసీ కెమెరాలు
స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన 769 సీసీ టీవీ కెమెరాలు జూన్ 27వ తేదీ నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షిస్తూ చలాన్లు జారీ చేస్తున్నారు. కరీంనగర్‌లో నాలుగు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించినప్పటికీ కొంత కాలంగా ఉల్లంఘనలను పట్టించుకోకపోవటంతో చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా నడుపుతూ జరిమానాల బారిన పడుతున్నారు. 15 రోజులుగా వాహనదారుల సెల్‌ఫోన్‌లకు జరిమానా చలాన్‌ల సందేశాలు రావడంతో కంగుతింటున్నారు. 21 రోజుల్లో వాహనదారులు 13,869 వివిధ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించగా ఇందులో 8,808 ట్రిపుల్ రైడింగ్ జరిమానాలే ఉన్నాయి.
ఫ నాలుగు కూడళ్లలో ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్
నగరంలోని నాలుగు కూడళ్లలో ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టిమ్ ఏర్పాటు చేశారు. ఈ నాలుగు సిగ్నల్స్ వద్ద కెమెరాలతోపాటుగా మిగతా అన్ని నగర రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గడిచిన 21 రోజుల్లో 13,869 ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు సీసీ కెమెరాలు గుర్తించి కమాండ్ కంట్రోల్‌రూంకు ఫోటోలతో సహా సందేశాలను పంపించాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి 1,13,43, 400 రూపాయల జరిమానాలు విధించారు. సరాసరిగా రోజుకు 660 వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించగా, రోజుకు 5.4 లక్షల రూపాయలు జరిమానా రూపంలో వాహనదారుల జేబులు ఖాళీ అయ్యాయి.
ఫ ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు
జూన్ 27 నుంచి జూలై 17 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 13,869 మందిపై కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో 1.13 కోట్ల రూపాయల జరిమానాలు విధించారు.
- ట్రిపుల్ రైడింగ్ కేసులు 8,808 నమోదు కాగా, 1,05,69,600 రూపాయలు జరిమానా విధించారు.
- సీట్ బెల్ట్ ధరించకుండా డైవ్రింగ్ చేసిన 3,437 మందిపై కేసులు నమోదు చేసి 3,43,700 రూపాయలు జరిమానా విధించారు.
- సెల్ ఫోన్ మాట్లాడుతూ డైవ్రింగ్ చేసిన 251 మందిపై కేసులు నమోదు చేసి 2.51 లక్షల రూపాయలు జరిమానా విధించారు.
- రాంగ్ రూట్ డైవ్రింగ్ చసిన 418 మందికి 83,600 రూపాయల జరిమానా విధించారు.
- హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన 955 మందికి 95,500 రూపాయలు జరిమానా విధించారు. ఈ నిబంధనను మొదటి రోజే అమలు చేశారు.
ప్రస్తుతానికి హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఓవర్ స్పీడ్ డైవ్రింగ్‌పై జరిమానాలు విధించట్లేదని, ఇతర శాఖల సమన్వయంతో త్వరలో అవి అమలు చేస్తామని పోలీస్ కమయిషనర్ తెలిపారు.
ఫ పకడ్బందీగా చలాన్ల వసూలు
మూడుకు పైగా చలాన్లు ఉన్న వాహనాలను పోలీసులు ఆపి జరిమానాలు చెల్లించిన తర్వాతనే వదిలిపెడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి తప్పించుకునేందుకు కొందరు నంబర్‌ప్లేట్లపై స్టిక్కర్లు అతికించటం, వంకరగా మలచడం వంటివి చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రతి రోజు నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు సరైన విధంగా వాహనానికి ముందు, వెనుక భాగాల్లో నంబర్‌ప్లేట్లను బిగించిన తరువాతనే వాహనాలను విడుదల చేస్తున్నారు.