karimnagar : పదేళ్ల సేవలకు గుర్తింపు ఏది?
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:45 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) అరకొర వేతనాలతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పదేళ్లపాటు సేవలందించి అతిథి(గెస్ట్) లెక్చరర్లుగా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
- ఖాళీల భర్తీతో అర్ధాంతరంగా తొలగింపు
- పెండింగ్‌లో నాలుగు నెలల గౌరవ వేతనం
- ఇబ్బందుల్లో గెస్ట్ లెక్చరర్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అరకొర వేతనాలతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పదేళ్లపాటు సేవలందించి అతిథి(గెస్ట్) లెక్చరర్లుగా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఉన్నఫలంగా వారిని తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్ల పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేశారు. పీజీతోపాటు అనుభవం కలిగిన నిరుద్యోగ యువకులతోపాటు పదవీ విరమణ పొందిన లెక్చరర్లకు గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసే అవకాశం కల్పించారు. ఒక నెలలో ఒక్కో గెస్ట్ లెక్చరర్ 72 పీరియడ్స్‌లో విద్యాబోధన చేస్తే 6,500 చొప్పున గౌరవ వేతనం చెల్లించింది. ఆ సమయంలో చాలా మంది రిటైర్డు లెక్చరర్లు ఈ పోస్టుల్లో నియమితులయ్యారు. వారి వయసురీత్యా అనుకున్న మేరకు ఫలితాలు రావడం లేదని గుర్తించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో త్రీమెన్ కమిటీ ద్వారా గెస్ట్ లెక్చరర్లను నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టి వారి గౌరవ వేతనాన్ని 21 వేల రూపాయలకు పెంచింది. పీజీ అర్హతతోపాటు అనుభవాన్ని బట్టి గెస్ట్ లెక్చరర్లను నియమించారు. దీంతో అనేక మంది పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులకు గెస్ట్‌లెక్చరర్ పదవులు లభించాయి. పదేళ్లుగా జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న తమకు ఏరోజైనా గుర్తింపు ఇస్తారని గెస్ట్ లెక్చరర్లు ఆశించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన కొంత మంది కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను రద్దు చేసి టీజీపీఎస్‌సీ ద్వారా జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసింది. దీంతో జిల్లాలో పదేళ్లపాటు గెస్ట్‌లెక్చరర్‌గా పనిచేసిన 22 మందిని తొలగించారు. వీరందరికి డిసెంబరు 2024 నుంచి మార్చి 2025 వరకు నాలుగు నెలల గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ఫ ఖాళీ పోస్టుల్లోనైనా సర్దుబాటు చేయండని వేడుకోలు
అరకొర వేతనాలతో జీవితం గడుపుతున్న గెస్ట్ లెక్చరర్లంతా నిరుద్యోగులుగా మారిపోయారు. జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియట్ బోర్డులోని ఖాళీల్లోనైనా తమను సర్దుబాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గురుకులాలు, మోడల్ స్కూల్‌లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నందున జూనియర్ కళాశాల్లోకూడా విద్యార్థుల సంఖ్యను బట్టి 1,654 మంది అతిథి అధ్యాపకులను భర్తీ చేసుకునేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించింది. ఆర్థికశాఖ 398 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. మరోసారి బోర్డు ఆప్ ఇంటర్మీడియట్ కార్యదర్శి మరో 494 పోస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలను పంపించారు. 1,654 పోస్టులకు అనుమతి వచ్చే అవకాశం లేక పోవడంతో కనీసం అనుమతి ఇచ్చిన ఖాళీల్లో సీనియార్టీని గుర్తించి నియామకాల్లో అవకాశమివ్వాలని గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు.
ఫ 1,654 గెస్ట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి:
- ఎన్.పూనమ్‌చందర్, హుజూరాబాద్
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,654 గెస్ట్ లెక్చరర్ పోస్టులను తొలగించిన గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేయాలి. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలి. పదేళ్ళు అరకొర వేతనాలతో రెగ్యులర్ లెక్చరర్లకు సమానంగా విధులు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్‌కు తమవంతు కృషిచేశానమని, కనీసం ఇంటర్మీడియట్ బోర్డులోని ఖాళీ పోస్టుల్లోనైనా తమకు అవకాశం ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.