Karimnagar: తడి, పొడి చెత్తను వేరు చేయాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:26 PM
కరీంనగర్ టౌన్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వ్యాపార సముదాయాలు, మద్యం దుకాణాల యజమానులు చెత్తను తడి, పొడిగా వేరుచేసి నగరపాలక సంస్థ వాహనాలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు.
- నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వ్యాపార సముదాయాలు, మద్యం దుకాణాల యజమానులు చెత్తను తడి, పొడిగా వేరుచేసి నగరపాలక సంస్థ వాహనాలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా లక్ష్మీనగర్, ఆదర్శనగర్, మంచిర్యాల చౌరస్తా, తదితర ప్రాంతాలను పారిశుధ్య అధికారులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఆదర్శనగర్‌వద్ద మద్యం దుకాణాదారులు షాపు ఎదుట పరిసర ప్రాంతంతోపాటు డ్రైనేజీల్లో చెత్తను వేసినందుకు రెండు షాపులకు 20 వేల జరిమానా విధించారు. లక్ష్మీనగర్‌లో ఓపెన్ స్థలంలో వర్షం నీరు నిలిచిన ప్రాంతాన్ని తనిఖీ చేసి ఖాళీ స్థలంలోని నీటిని కచ్చా నాలా ద్వారా తొలగించి స్థల యజమానికి జరిమాన విధించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నగర ప్రజలు విషజ్వరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేయడాన్ని నిషేధించామన్నారు. నిబంధనలు అతిక్రమించి చెత్తను పరిసరాలు, డ్రైనేజీల్లో వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.. వర్షాకాలంలో విషజ్వరాలు రాకుండా తగిన నివారణ, జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. వర్షం నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర ప్రజలు పరిశుభ్రతను పాటిస్తే అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ స్వామి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు నరోత్తమ్‌రెడ్డి, శ్రీధర్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది, జవాన్లు పాల్గొన్నారు.