Karimnagar: కరీంనగర్, సిరిసిల్ల జడ్పీలపై కాషాయ జెండా ఎగురవేస్తాం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:50 PM
కరీంనగర్ టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల జడ్పీలను బీజేపీ కైవసం చేసుకొని కాషాయపుజెండా ఎగురవేస్తామని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
- సర్వే ఆధారంగా పార్టీ టికెట్లు
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల జడ్పీలను బీజేపీ కైవసం చేసుకొని కాషాయపుజెండా ఎగురవేస్తామని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర పార్టీ సర్వే చేపిస్తోందని, సర్వేలు కూడా ఇవే ఫలితాలను చెబుతున్నాయని సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సంజయ్‌మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే కాంగ్రెస్ పార్టీకి సోయి కూడా లేదని ఆరోపించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా అని తాను ఎదురుచూస్తున్నానని, ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల టికెట్ కేటాయింపు విషయాన్ని చూసుకుంటుందని, ఇప్పటికే సర్వే కూడా జరిపిస్తోందని చెప్పారు. సర్వే నివేదికను బట్టే గెలుపే ప్రాతిపదికన టికెట్లు వస్తాయని అన్నారు. టికెట్ రానివారు బాధపడవద్దని, వారికి పార్టీ పదవులు సహా ఇతరత్రా అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీశ్రేణులకు భరోసా ఇచ్చారు. ప్రతి పల్లెలో ఉపాధి హామీ పనులు, ప్రధాని సడక్ యోజన, సీఐఆర్‌ఎఫ్ సహా అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. మహిళలకు 2500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని కాంగ్రెస్ మాటతప్పిందని, వృద్దులకు 4వేల పెన్షన్ ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. రైతు కూలీలలకు రైతుభరోసా, రైతులకు కూడా ఒక్కసారే రైతు భరోసా ఇచ్చారు, ఎన్నికల తర్వాత రైతుభరోసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టబోతుం దని సంజయ్ ఆరోపించారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీలకు ఒక్క పైస అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ బలం, బలగం పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ కూడా చేయకుండా చేతులెత్తేసిందని సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్‌కు టీచర్ ఎమ్మెల్సీగా పోటీచేసే అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకునే మంచి అవకాశముందని, దీన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, మాజీ మేయర్లు యాదగిరి సునీల్‌రావు, డి.శంకర్, పార్టమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, కోమల ఆంజనేయులు, వాసాల రమేశ్, రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.