Share News

Karimnagar: బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కలిసిరావాలి

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:20 AM

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బీసీలపై ప్రేమ ఉంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

Karimnagar:   బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కలిసిరావాలి

- మా చిత్తశుద్ధిని శంకించేవారికి పుట్టగతులుండవు

- రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బీసీలపై ప్రేమ ఉంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల సర్వేపై మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి శనివారం సాయంత్రం నివేదిక ఇస్తుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అడ్డంకులు వస్తే ఆర్డినెన్స్‌ తెచ్చి సవరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తమ చిత్తశుద్ధి శంకించేవారికి పుట్టగతులు ఉండవన్నారు. కొందరు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కుల గణన మొదలు ఆర్డినెన్స్‌ వరకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, ఈ విధానం కాకుండా ఎలా అమలవుతాయో ఇంకేమైనా సలహాలుంటే స్వీకరిస్తామన్నారు.

ఫ అర్హులందరికీ రేషన్‌ కార్డులు

సైదాపూర్‌: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తున్నామని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైదాపూర్‌ మండలంలోని వెన్కేపల్లి పోలుకమ్మ చెరువు వద్ద నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మించిన మోడల్‌ ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం విశాల సహకార పరపతి సంఘం పంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, సీఎం రిలీప్‌ఫండ్‌ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాల చెక్కులు, గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు, మహిళా సంఘాలకు స్టీల్‌ సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైదాపూర్‌ మండలానికి 1,301 కొత్త రేషన్‌ కార్డులు ఇస్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ భూసేకరణ జరుగుతున్నదని, త్వరలోనే పూర్తయి మండలానికి సాగు నీరు అందుతుందని తెలిపారు. సైదాపూర్‌ మండలానికి 585 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 385 మంది లబ్ధిదారులు ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం, ఉచితంగా ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఇస్తున్నామన్నారు. మండలంలోని మహిళా సంఘాలకు కోటి రూపాయల వడ్డిలేని రుణాల చెక్కులను ఇస్తున్నామన్నారు. మండలంలో ఆరు వీవో బిల్డింగ్‌లు మంజూరు చేశామని తెలిపారు. మండలంలో వైద్య శిబిరాలు నిర్వహించి అందరికీ పరీక్షలు చేయిస్తామన్నారు. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్‌ రహిత నియోజక వర్గంగా తీర్చి దిద్దేందుకు నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో మహిళా సంఘాలతో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. ఏ గ్రామానికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు రాకుండా చేస్తే ఆ గ్రామానికి ఐదు మంచి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. చదువు మధ్యలో ఆపేసిన మహిళలు ఓపెన్‌ స్కూల్‌లో చేరాలని సూచించారు. ప్రతీ ఇంట్లో మునగ, నిమ్మ, జామ, కరివేపాకు చెట్లు నాటాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొంత సుధాకర్‌, సహకార సంఘం అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:20 AM